పెళ్లి చేసుకుంటానంటూ విద్యార్థినికి లెక్చరర్ లైంగిక వేధింపులు: దేహశుద్ధి
కర్నూలు: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ అధ్యాపకుడు కీచకుడిలా మారాడు. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు, విద్యార్థులు సదరు లెక్చరర్‌కు దేహశుద్ధి చేశారు.
వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లాలోని బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న ఓ ఇంటర్ విద్యార్థినిపై ఉర్దూ లెక్చరర్ అమరుల్లాఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఆ విద్యార్థిని ఎన్నిసార్లు తిరస్కరించినా పెళ్లి చేసుకుంటానంటూ వేధించాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కాగా, ఈ సంఘటనపై కళాశాల విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.

కీచక అధ్యాపకుడు అమరుల్లాఖాన్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన అధ్యాపకులు ప్రవర్తన ఈవిధంగా ఉండటం సిగ్గుచేటని పలువురు విమర్శించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు లెక్చరర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
పెట్రోలు పోసి కాల్చేశారు
గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి తగల బెట్టారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకుగల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications