పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను లాడ్జికి తీసుకెళ్ళి అత్యాచారం ; ద్వారకా తిరుమలలో ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతులు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రేమోన్మాదుల దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఏపీలో మహిళల, బాలికల రక్షణ కరువు అవుతుందని, జగన్ సర్కార్ మహిళల రక్షణపై దృష్టి సారించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుకో చోట బాలికలపై అత్యాచారాలు చోటుచేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుమీద బీటెక్ విద్యార్థిని రమ్యను ప్రేమోన్మాది కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది.ఆ తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

కొనసాగుతున్న రమ్య హత్య కేసు రగడ
తెలుగుదేశం పార్టీ రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తూనే ఉంటామని, ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామని ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని రమ్యను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన
ఇదిలా ఉంటే ఇటీవల గుంటూరు జిల్లా రాజుపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపగా, తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఏపీ వాసులను విస్మయానికి గురి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని పంగిడి గూడెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ మైనర్ బాలికను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి లాడ్జ్ కు తీసుకెళ్ళి అత్యాచారం
15 సంవత్సరాల వయసున్న బాలికకు నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పెయింటర్ బుద్దాల అంజిబాబుతో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్లు నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఈ నెల 19న ద్వారకా తిరుమలకు రప్పించిన అంజిబాబు, అనంతరం బాలికను ఒక లాడ్జ్ కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై బస్టాండ్ కు తీసుకు వెళ్ళి విడిచిపెట్టాడు . తనకు ఆల్రెడీ పెళ్లయిందని ఇంటికి వెళ్లి పొమ్మని చెప్పి అంజిబాబు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీంతో బాలిక ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు అంజి బాబుపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

మైనర్ బాలికలపై పెరుగుతున్న అకృత్యాలు .. దిశా చట్టం కఠినంగా అమలు చెయ్యాలని డిమాండ్
మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి అత్యాచారాలకు పాల్పడడం, ఒకవేళ చెప్పిన మాట వినకుంటే బలవంతంగా అత్యాచారం చేయటం, బయట చెప్పొద్దని బెదిరించటం, బయట తెలుస్తుంది అనుకుంటే హతమార్చడం నిత్యకృత్యంగా మారుతున్నాయి. బాలికా సంరక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా ఆ చట్టాలు ఏవీ నిందితులలో భయాన్ని కలిగించలేకపోతున్నాయి .
దీంతో మృగాళ్లు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితులు మారాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, నేరానికి పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications