మూడు రోజులపాటు అడవిలో బంధించి చెంచు మహిళపై గ్యాంగ్‌రేప్
కర్నూలు: ఓ చెంచు మహిళ(27)పై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడవిలోకి తీసుకెళ్లి మూడు రోజులపాటు బంధించిన దుర్మార్గులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత చెట్టుకు కట్టేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది.
కాగా, శనివారం ఓ వ్యక్తిసాయంతో ఇంటికి చేరిన బాధితురాలు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసులు, బాధితురాలు ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండల పరిధిలోని నాగలూటిగూడానికి చెందిన చెంచు మహిళ(27) భర్త వదిలేయడంతో కూతురితో కలిసి తల్లివద్ద ఉంటోంది.

బుధవారం నాగలూటిగూడానికి సమీపంలోని దర్గావద్ద భక్తులు పెడుతున్న భోజనం కోసం బాధితురాలు వెళ్లింది. సాయంత్రం తిరిగి వస్తుండగా ఒంటరిగా ఉన్న ఆమెను అదే గూడానికి చెందిన ఆరుగురు చెంచు యువకులు బలవంతంగా అడవిలోకి ఎత్తుకెళ్లారు. అత్యాచారం జరిపేందుకు యత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో ఎడమ చెయ్యి, కడుపుపై బాణంతో గాయపరిచారు.
మూడు రోజులపాటు అడివిలో బంధించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చెట్టుకు కట్టేసి పారిపోయారు. శనివారం అదే గూడానికి చెందిన ఓ వ్యక్తి అడవిలోకి వెళ్తుండగా పొదల మాటునుంచి మూలుగు వినిపించడంతో దగ్గరికి వెళ్లి చూస్తే బంధించివున్న మహిళ కనిపించింది. తాళ్లు విప్పి ఆమెను బయటికి తీసుకొచ్చాడు.
నడవలేని స్థితిలో ఉన్న ఆమెను అక్కడే ఉంచి గూడెం చేరుకుని బాధితురాలి తల్లికి సమాచారం అందించాడు. వెంటనే బంధువులను వెంటబెట్టుకుని అడవిలోకి వెళ్లి బాధితురాలిని ఇంటికి తీసుకొచ్చారు. బంధువుల సాయంతో బాధితురాలు ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications