చిత్తూరులో మరో కామాంధుడి రాక్షస క్రీడ : ఇద్దరు బాలికలను మిద్దెపైకి తీసుకెళ్ళి ఆపై ..
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా ఏదో ఒక సంఘటన సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. కాపాడాల్సిన కన్న తండ్రులు కూడా కామాంధులుగా కన్నబిడ్డల జీవితాలను చిద్రం చేస్తున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిన్నారులను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తి మీద సాములాగా తయారయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో, కామాంధులు ఏ రూపంలో వస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఏపీలో వారం వ్యవధిలో పలు షాకింగ్ ఘటనలు
ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా, అభం శుభం తెలియని చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. చాక్లెట్ ఆశ చూపి కొందరు, ఆడుకుందాం రమ్మని కొందరు, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మరికొందరు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడం పోలీసులకు, ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలోనే బాలికలపై అత్యాచార ఘటనలు రోజుకు ఒకటి చొప్పున వెలుగుచూశాయి.

చిత్తూరు జిల్లా బీ కొత్తపేటలో దారుణం .. ఆడుకుంటున్న బాలికలను తీసుకెళ్ళి అత్యాచారయత్నం
తాజాగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. నిన్న రాత్రి ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్న క్రమంలో 21 సంవత్సరాల వయసున్న అనిల్ కుమార్ కళ్ళు వారి మీద పడ్డాయి. నిదానంగా వారి దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి వారిని తీసుకుని మిద్దె పైకి వెళ్ళాడు. అక్కడ మొదట తొమ్మిది సంవత్సరాల వయసున్న బాలికపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ఏళ్ల బాలికను తొడ మీద కూర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

బాలిక ఇంటికెళ్ళి జరిగింది చెప్పటంతో పోలీసులకు సమాచారం .. నిందితుడు అరెస్ట్
మొదట కామాంధుడి చేతిలో అఘాయిత్యానికి గురైన బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన అమ్మమ్మ సావిత్రికి జరిగిందంతా చెప్పింది. దీంతో బాలికను వెంటబెట్టుకుని సావిత్రి మిద్దె మీదకి వెళ్లి చూడగా మరో బాలికతో మానవ మృగంలా ఆ యువకుడు ప్రవర్తిస్తున్నాడు. వెంటనే అప్రమత్తమైన సావిత్రి దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రావడంతో నిందితుడిని పట్టుకోగలిగారు అని, ఇంకో దారుణం జరుగకుండా అడ్డుకోగలిగారని స్థానికులు భావిస్తున్నారు.
Recommended Video

బాలికలపై అత్యాచారాలు .. సమాజం ముందు అతి పెద్ద సమస్య .. పరిష్కారం ఎలా ?
ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయడం ఎలా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమంది నేరస్తులకు శిక్షలు పడినా మనుషుల్లో పెరిగిపోతున్న ఈ పశుప్రవృత్తి మారకపోవడం గమనార్హం. నిత్యం ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మానవ ప్రవృత్తిలో వస్తున్న మార్పుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి జరిగిన తర్వాత తీసుకునే చర్యల కంటే, జరగకుండా ఉండడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications