ప్రత్యేకహోదా కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం: జగన్ దీక్షకు మద్దతుగా మరో మహిళ
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేస్తున్న మాసుమయ్య అనే విద్యార్థి గత నాలుగు రోజులుగా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్నాడు.
సోమవారం కూడా విద్యార్థులు తరగతులను బహిష్కరించి.. ఏడీ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో మాసుమయ్య తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
అయితే, సమయానికి తోటి విద్యార్థులు అతడిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్ద ఎత్తున అతడి ఒంటిపై పెట్రోలు పడినా.. సమయానికి విద్యార్థులు గమనించడంతో మాసమయ్య ప్రాణాలతో బయటపడ్డాడు.

గతంలో ప్రత్యేక హోదా కోసం మునుకోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా, హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాని జగన్ పేర్కొన్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
కాగా, జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రైల్వే కోడూరులో చోటు చేసుకుంది.
జగన్ దీక్షకు మద్దతుగా ప్రత్యేక హోదా కోసం సోమవారం కడప జిల్లాలోని రైల్వేకోడూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగమ్మ అనే మహిళా కార్యకర్త సూపర్ వాస్మల్ అనే ద్రవం తాగింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications