పెళ్లి చేయడం లేదని ఆత్మహత్య: పెళ్లాడమన్నందుకు విషం తాగించాడు
రంగారెడ్డి: తనకు పెళ్లి చేయడంలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కక్కులూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన జనిగె రాములు (23) కు అనిత అనే సోదరి ఉంది.
తల్లిదండ్రులు లేని వారిద్దరూ మండలంలోని కక్కులూరు గ్రామంలో ఉంటున్న పెద్దమ్మ మణెమ్మ వద్ద పెరిగారు. కొంతకాలం క్రితం అనితకు పెళ్లి చేశారు. ప్రస్తుతం రాములు తనకు కూడా పెళ్లి చేయాలని మణెమ్మను కోరుతున్నాడు. 'అనిత పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు. ఈ సమయంలో పెళ్లి చేయడానికి డబ్బుల్లేవు. కొంత కాలం ఆగాలి' అని మణెమ్మ అతనికి నచ్చచెబుతూ వచ్చేది.
ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన రాములు సోమవారం రాత్రి పొలంలోని గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులకు విగత జీవిగా కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లాడమంటే విషం తాగించాడు
రెండేళ్లపాటు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డ ఓ యువకుడు.. పెళ్లి చేసుకోమన్న యువతికి విషం తాగించి పరారయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నారాయణపేట మండలం పేరపళ్ల తండాకు చెందిన పేరపళ్ల గురుమూర్తి అనే యువకుడు.. అదే తండాకు చెందిన యువతితో రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. వారి పొలాలు తండాకు దగ్గరలో పక్కపక్కనే ఉన్నాయి.
సదరు యువతి ఇటీవల గురుమూర్తి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా మొహం చాటేశాడు. ఆమె ఈ విషయమై గట్టిగా నిలదీస్తుండటంతో తప్పించుకునేందుకు ఆదివారం రాత్రి పథకం ప్రకారం పొలంలోకి తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చిన పురుగులమందును ఆమెకు బలవంతంగా తాగించి పరారయ్యాడు.
ఆ యువతి కేకలు వేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాధితురాలిని సోమవారం ఉదయం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్య చికిత్స అనంతరం యువతి కోలుకుంది. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు, యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications