తహశీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. భారీగా నగదు, నగలు, ఆస్తిపత్రాలు లభ్యం
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తహశీల్దార్ బి.టి.వి. రామారావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
భీమునిపట్నం: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తహశీల్దార్ బి.టి.వి. రామారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ లో రెండు చోట్ల, రాజమండ్రిలో ఒక చోట, విశాఖపట్నంలో నాలుగు చోట్ల ఈ దాడులు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న రామారావుకు సంబంధించిన ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.

రామారావు అల్లుడి ఇంట్లో భారీ ఎత్తున నగదు లభ్యమైనట్లు సమాచారం. అలాగే.. రామారావు ఇంట్లో కూడా రూ.15 లక్షలను అధికారులు గుర్తించారు. ఆయన అల్లుడి ఇంట్లో రూ.30 లక్షల నగదును గుర్తించారు.
ఇంకా రామారావుకు సంబంధించిన ఆయా ప్రాంతాల్లోని ఇళ్లల్లో నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయని, పూర్తయిన తరువాతే మొత్తం సమాచారం బయటికి వస్తుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications