ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తాజా ఆదేశాలు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న నిందితులకు విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నిందితులందరూ ఈ నెల 12వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు. ప్రస్తుతం ఏడుమంది నిందితులు విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఇదే కేసులో విచారణను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ను పొందారు. ఎల్లుండి ఆయన సరెండర్ కావాల్సి ఉంది. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది. దీనిపై ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

కాగా- ఈ కేసులో నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
మిగిలిన నిందితులకు బెయిల్ ఇవ్వవద్దంటూ కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. ఇప్పటికే నిందితులు బెయిల్ పై జైలు నుంచి విడుదలయినందున నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వలేమని, నిందితులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సహా మరికొందరిపై లిక్కర్ కుంభకోణం కేసులు నమోదయ్యాయి. వీరిలో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి బెయిల్ లభించింది. వాళ్లు జైలు నుంచి విడుదల అయ్యారు.
మిగిలిన నిందితుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో సిట్ అధికారులు వారిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. విచారణ కొనసాగుతున్నందున రిమాండ్ ను పొడిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. వాదోపవాదాలను విన్న అనంతరం రిమాండ్ ఈ నెల 12వ తేదీ వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది.












Click it and Unblock the Notifications