అచ్చెన్న మరో బాంబ్- ప్రతిపక్షంలో బాబు సోదంతా చెబుతారు..!! అధికారంలోకి వస్తే వారి మాటే వింటారు..!!
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు ఎర్రన్నాయుడు మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి బై పోల్ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చింది. పార్టీ లేదు.. బొక్కా లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు టీడీపీలో..రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇక, ఇప్పుడు ఆయన మరోసారి పార్టీ అధినేత తీరు గురించి ఓపెన్ గా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. అందునా చంద్రబాబు అధికారంలో లేని సమయంలో ఏ రకంగా చెబుతారు..అధికారంలోకి వచ్చిన తరువాత ఏ రకంగా వ్యవహరిస్తారో అచ్చెన్న చెప్పుకొచ్చారు.

అచ్చెన్న వ్యాఖ్యలపై చర్చ
టీడీపీ అనుబంధ విభాగమైన టీఎన్టీయూసీ విద్యుత్ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ సభలో అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేసారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు సోదంతా చెబుతారని..అధికారంలోకి వచ్చిన తరువాత అధికారుల మాటే వింటారంటూ తన మనసులోని అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేసారు. అధికారంలో ఉన్న సమయంలో తాము కూడా కొన్ని తప్పులు చేశామని అచ్చెన్న అంగీకరించారు. తాము అన్నీ చేసాం కానీ, కింది స్థాయిలోని వారిని దగ్గరకు తీసుకోవటం లో వైఫల్యం చెందామని చెప్పుకొచ్చారు.

తప్పులు చేశామని అంగీకారం
ఉద్యోగులు..కార్మికులు అంతా టీడీపీతోనే ఉన్నారని అనుకున్నామని... అయితే, హామీలు గుప్పించటంతో ఉద్యోగులు ఎగిరెగిరి ఫ్యాన్ కు ఓటేసారని వ్యాఖ్యానించారు. తాము ఎంత చెప్పినా వినలేదంటూ...వాపోయారు. గతంలో అధికారం వచ్చిన తరువాత కొత్త రాష్ట్రం ఏదో చేద్దామనే తాపత్రయంలో చంద్రబాబు బాగా బిజీగా ఉండేవారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా చంద్రబాబు తిరిగి సీఎం అవ్వటం ఖాయమని అచ్చెన్న ధీమా వ్యక్తం చేసారు. అధికారంలో లేని సమయంలో చంద్రబాబు..పార్టీ ముఖ్య నేతలు ఇలాగే మాట్లాడుతారు.. అధికారంలోకి వచ్చిన తరువాత మిమ్మల్ని పట్టించుకోరనే భావన ఉందని... కానీ, ఈ సారి మాత్రం అలా జరగదని హామీ ఇచ్చారు.

చంద్రబాబును ఒప్పించే బాధ్యత నాది
ఈ సారి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మాట వినకపోయినా, తామంతా కలిసి చంద్రబాబుకు నచ్చ చెప్పి ప్రజా పాలన తీసుకొస్తామంటూ వారికి మాట ఇచ్చారు. కింది స్థాయిలో పని చేసే కార్యకర్తల మాటకు విలువ ఇచ్చేలా.. కార్మికులకు న్యాయం జరిగే విధంగా తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యత తీసుకుంటానని అచ్చెన్న కార్మిక సంఘాల నేతలకు అభయమిచ్చారు. అయితే, అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో జరిగిన పొరపాట్లను సరి చేసుకుంటున్నామని చెప్పే ప్రయత్నంలోనే ఈ విధంగా మాట్లారంటూ కొందరు నేతలు సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు..
మరి కొందరు మాత్రం ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో..అధికారంలో లేని సమయంలో చంద్రబాబు చెప్పే మాటల గురించి ఆ రకంగా వ్యాఖ్యానించటం నష్టం చేస్తుందనేది మరి కొందరి అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పటం ద్వారా ..ఇప్పటికే నుంచే 2024 ఎన్నికల కోసం టీడీపీ అడుగులు వేయటం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. గతంలో తిరుపతి ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో పాటుగా చర్చకు కారణమయ్యాయి. ఇక, ఇప్పుడు అచ్చెన్న చేసిన వ్యాఖ్యల పైన ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications