సూడో పోలీసు: 8కిలోల బంగారం సంచీలు ఎత్తుకెళ్లారు
హైదరాబాద్: పోలీసుల్లా ఫోజు కొట్టి, ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేస్తున్నట్లు నటించి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాదు నడిబొడ్డున జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికుల వద్దకు పోలీసుల రూపంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి సంచులు తనిఖీ చేయాలని అన్నారు. ఇద్దరు ప్రయాణికులు కూడా వారిని విశ్వసించలేదు. అయితే, కొంతదూరం వారిని బలవంతంగా తీసుకెళ్లి చేతిలో ఉన్న బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. మొత్తం ఎనిమిది కిలోల బంగారాన్ని నిమిషాల వ్యవధిలో దొంగిలించారు.
ఈ సంఘటన హైదరాబాదులోని లక్డీకాపుల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. బాధితులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఎంవీఎస్ జువెలర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ బంగారు ఆభరణాలు తయారుచేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పలు బంగారం దుకాణాల్లో మార్కెటింగ్ చేయడానికి సంస్థకు చెందిన జతిన్ ప్రతాప్ సిన్హా, దేవేంద్ర త్రివేదీతోపాటు మరో ఇద్దరు తొమ్మిదో తేదీన ఇక్కడకి వచ్చారు. బషీర్‌బాగ్, ఆబిడ్స్ ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో మార్కెటింగ్ చేశారు.

జతిన్ ప్రతాప్ సిన్హా, దేవేంద్ర త్రివేదీ బెంగళూరు వెళ్లేందుకు టికెట్లు కొనుగోలుకు ఆదివారం సాయంత్రం లక్డీకాపుల్ హెచ్‌కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. వీరితోపాటు వచ్చిన మరో ఇద్దరు ముంబై వెళ్లిపోయారు. టికెట్ కొనుగోలు చేసిన జతిన్, దేవేంద్ర త్రివేదీ బస్సు కోసం ట్రావెల్స్ వద్ద వేచి ఉన్నారు. రాత్రి 10.30 గంటలకు ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వారి వద్దకు వచ్చారు. తాము క్రైమ్ పోలీసులమని, బ్యాగులో ఏముందో చూపించాలని పోలీసుల మాదిరిగా ప్రశ్నించారు.
ముందు అనుమానించిన జతిన్, త్రివేదీ వారిని గుర్తింపు కార్డులు చూపించమని అడిగారు. దీంతో పోలీసు తరహా యాక్షన్ చేశారు. వారిద్దర్నీ రవీంద్రభారతి వైపునకు కొంతదూరం బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడున్న మిగిలిన ప్రయాణికులంతా చూస్తూ ఉండిపోయారు. ఇలా కొంతదూరం వచ్చిన వారి నుంచి ఎనిమిది కిలోల బంగారం ఉన్న బ్యాగ్ లాక్కుని మోటారు సైకిల్‌పై ఉన్న మరో వ్యక్తికి ఇచ్చి పంపేశారు. అనంతరం వారూ పరారయ్యారు.
జరిగిన విషయాన్ని వెంటనే ముంబైలోని సంస్థ యజమాని వినీత్, ఎస్.గాంధీకి చెప్పారు. వారు సోమవారం హైదరాబాద్ వచ్చి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బంగారం విలువ రూ.2.6 కోట్లుగా అంచనా వేశారు.
పోలీసుల్లాగా ప్రవర్తించి ఎనిమిది కిలోల బంగారాన్ని దొంగిలించిన నలుగురు నిందితులూ సిసి కెమెరాకు చిక్కారు. లక్డీకాపుల్ ఏపీ డీజీపీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రెండు పెట్రోలు బంకులకు మధ్యలో హెచ్‌కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం ఉంది. దీనికి పక్కనే హెచ్‌పీ పెట్రోలు బంకు ఉంది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం వద్ద బస్‌స్టాప్ దగ్గర పోలీసు విభాగం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఉంది. బ్యాగ్‌ను దొంగిలించిన నిందితులు రవీంద్రభారతి వైపు పారిపోయారు. అక్కడ ఉన్న జంక్షన్‌లోనూ సీసీ కెమెరాలున్నాయి. వీటన్నింటిలోనూ నింది తుల కదలికలు నమోదై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ చోరీలలో మొత్తం నలుగురు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
నిందితులు వ్యాపారులతో జరిపిన సంభా షణంతా హిందీలోనే సాగింది. మధ్య మండల పోలీసు డిప్యూటీ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి, సైఫాబాద్ సహాయ కమిషనర్ నారాయణ, ఇన్‌స్పెక్టర్ అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది కచ్చితంగా సూడో పోలీసు గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు దర్యాప్తునకు ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు.












Click it and Unblock the Notifications