అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ది మార్పు - ఛాన్స్ దక్కేదెవరికి..!?
సీఎం జగన్ ఉత్తరాంధ్రపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్ అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీ ముఖ్యులతో సమీక్ష చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు దిశగా వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు పైన కొత్త ప్లాన్ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి ముత్యాలనాయుడు స్థానంలో కొత్త అభ్యర్ది ప్రకటన పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ప్రతీ సీటు ప్రతిష్ఠాత్మకం
అనకాపల్లి స్థానంలో గెలుపును ఈ సారి జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లిలో పోటీ చేస్తుండటంతో లోకల్ -నాన్ లోకల్ నినాదం వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాయుడును ఎంపీ అభ్యర్దిగా బరిలోకి దింపి...ఆయన కుమార్తెకు మాడుగుల సీటు కేటాయించింది. అయితే, తాజాగా ఎంపీ అభ్యర్ది మార్పు పైన పార్టీలో చర్చ జరుగుతోంది. అనకాపల్లిలో దాదాపు 14 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రధానంగా కాపు, వెలమ, గవర సామాజిక వర్గాల ప్రజలే 75 శాతానికి పైగా ఉంటారు. దీంతో, ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ ఎప్పుడు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు ఇవ్వటం ఆనవాయితీగా మారుతోంది.

అనకాపల్లి పై ఫోకస్
అయితే, టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసి అనకాపల్లి సీటు పైన ఆశలు పెట్టుకున్న ఆడారి కిషోర్ కుమార్ తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోనూ కిషోర్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఏపీ ప్రయోజనాల విషయంలో తమ వాదన వినిపించారు. టీడీపీ కోసం శ్రమించినా తనకు గుర్తింపు ఇవ్వకపోవటంతో కిషోర్ కుమార్ మనస్తాపానికి గురయ్యారు. వైసీపీలో చేరే సమయం లోనే ముఖ్యమంత్రి జగన్ నుంచి కిషోర్ కు స్పష్టమైన హామీ ఉందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో విశాఖ విమానాశ్రయం రన్ వే పైన కిషోర్ ఆందోళన చేయటంతో కేంద్ర సాయుధ బలగాలు కేసు నమోదు చేసారు. అనకాపల్లిలో పని చేసుకోవాలని..సీటు ఇస్తామని హామీ ఇచ్చినా..చిరవకు సీటు దక్కలేదు..
వైసీపీ అభ్యర్ది మార్పుకు ఛాన్స్
దీంతో, మద్దతుదారుల సూచన మేరకు వైసీపీలో చేరారు. అనకాపల్లిలో సిట్టింగ్ ఎంపీ సత్యవతిని కాదని..ముత్యాల నాయుడుకు సీటు ఇచ్చారు. సీఎం రమేష్ కు ధీటుగా దూకుడుగా వ్యవహరించే కిషోర్ కుమార్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్లు ఉమ్మడి విశాఖ నేతల్లో చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలతో పాటుగా స్థానికుడు..సత్సంబంధాలు ఉండటంతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అనకాపల్లితో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో సామాజిక సమీకరణాలు..ప్రస్తుత పార్టీ బలాబలాలపైన జగన్ సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్ది మార్పు పైనా జగన్ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త అభ్యర్దిగా అడారి కిషోర్ కుమార్ పేరు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications