ఏపీలో మరోసారి ఏకమవుతున్న విపక్షాలు-కలిసొచ్చిన ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం-వైసీపీపై ఒత్తిడి
ఏపీలో విపక్షాలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తిచేసుకోవడం, ఇందులో తాము విడివిడిగా పోరాటాలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో విపక్ష పార్టీలన్నీ సమయం దొరికినప్పుడల్లా ఏకమవుతున్నాయి. అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించిన సభలో ఒకే గొంతు వినిపించిన విపక్ష పార్టీలు.. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం వ్యవహారంలోనూ అదే తీరు ప్రదర్శిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వీరంతా కూటమి కావడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో విపక్షాల ఐక్యత
ఏపీలో విపక్షాలు మునుపెన్నడూ లేనంత ఐక్యత ప్రదర్శిస్తున్నాయి. వైసీపీ సర్కార్ పై విడివిడిగా పోరాటాలు చేయడం వల్ల లాభం లేదని గ్రహించిన విపక్ష పార్టీలు.. ఇప్పుడు కిలిసి ముందుకు సాగుతున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా పోరు మారుతోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గతంలో పార్టీల వారీగా తమ వాదన మాత్రం వినిపించే విపక్షాలు ఇప్పుడు మాత్రం ఒకే వాదన వినిపిస్తున్నాయి. తాజాగా అమరావతి రాజధాని విషయంలో తిరుపతిలో జరిగిన సభలో అదే బాట పట్టిన విపక్షాలు.. ఇప్పుడు గుంటుూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం నేపథ్యంలో ఉమ్మడిగా కదులుతున్నాయి.

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై స్పందన
గుంటూరు జిల్లాలోని దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ స్ధానిక నేత ఒకరు పట్టపగలే దాడికి దిగడంతో ఈ వ్యవహారంపై విపక్షాలన్నీ స్పందిస్తున్నాయి.. టీడీపీతో పాటు బీజేపీ, సీపీఐ, ఇతర విపక్ష పార్టీలు కూడా ఈ ఘటనను ఖండించాయి. వైసీపీ నేత ఇలా పట్టపగలే బరితెగించడం సరికాదంటూ విమర్శలు చేస్తున్నాయి. దీంతో వైసీపీ ఇరుకునపడుతోంది. ఈ ఘటనపై గుంటూరు పోలీసులు స్పందించి నిందితుడిని అరెస్టు చేస్తామని ప్రకటించినా విపక్షాల విమర్శలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు.

టీడీపీకి తోడుగా విపక్షం
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనపై గతంలో అయితే టీడీపీ మాత్రమే స్పందించి ఊరుకునేది. ఇప్పుడు టీడీపీకి గత కొంతకాలంగా దగ్గరగాఉన్న సీపీఐతో పాటు కొత్త మిత్రపక్షం బీజేపీ కూడా ఈసారి దుర్గి ఘటనపై స్పందించింది. బీజేపీ తరఫున ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్వీట్ చేశారు. పల్నాటి పౌరుషంపై సినిమాలు కూడా తీసిన మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తారా అంటూ వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. దీంతో పాటు సీపీఐ రామకృష్ణ కూడా ఈ ఘటనకు కారకులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

పొలిటికల్ సీన్ మారుతోందా ?
ఏపీలో రాజకీయం గతంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మాత్రమే ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతర పాకర్టీలతో పోలిస్తే టీడీపీనే ఎక్కువగా టార్గెట్ చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ .. టీడీపీతో పాటు బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ రూపంలో ఇతర విపక్షాలను సైతం ఎదుర్కోక తప్పని పరిస్ధితి. దీంతో వైసీపీపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. వాస్తవానికి దుర్గి ఘటనలో ఓ వైసీపీ స్ధానిక నేత చేసిన పనికి ఇప్పుడు విపక్షమంతా కట్టగట్టుకుని అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో విపక్షాల ఐక్యత వైసీపీకి కచ్చితంగా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.