భార్యతో సెల్ఫీ - ప్రాణం పోగొట్టుకున్న మావోయిస్టు చలపతి ?
నిన్న ఛత్తీస్ ఘడ్-ఒడిశా సరిహద్దుల్లో ఓ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇందులో ఏపీకి చెందిన మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి మరణం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా కేంద్రం కూడా భావిస్తోంది. అయితే దశాబ్దాలుగా అజ్ఞాతంలో గడిపిన చలపతి ఇలా చనిపోవడం వెనుక కీలక కారణం ఉంది.
మావోయిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన చలపతి.. 2008లో ఒడిశాలోని నయాగఢ్ దాడిలో 13 మంది పోలీసుల్ని పొట్టనపెట్టుకున్న ఘటనలో కీలక నిందితుడు. పోలీసు ఆయుధాగారాన్ని దోచుకున్న తర్వాత మావోయిస్టులు నయాగఢ్ నుండి విజయవంతంగా తప్పించుకోగలరన్న భరోసా ఇచ్చేందుకే చలపతి ఈ దాడి చేసినట్లు చెబుతారు. ఆయుధాగారంపై దాడి జరుగుతున్నప్పుడు పోలీసు బలగాలు నయాగర్‌లోకి ప్రవేశించకుండా చలపతే చూసుకున్నారని, మావోయిస్టులు భారీ చెట్ల కొమ్మలతో పట్టణానికి వెళ్లే అన్ని రహదారులను అడ్డుకున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

అయితే చాలా సంవత్సరాల పాటు ఇంకా చెప్పాలంటే దశాబ్దాల పాటు అజ్ఞాతంలోనే ఉంటూ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన చలపతి.. ఇలా హఠాత్తుగా ఎందుకు ప్రాణాలు కోల్పోయాడన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇందులో
అతని భార్య అరుణతో తాను తీసుకున్న సెల్ఫీయే అతని ప్రాణం తీసిందని పోలీసులు చెప్తున్నారు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్ గా ఉన్న తన భార్య అరుణతో కొంతకాలం క్రితం చలపతి సెల్ఫీ తీసుకున్నాడు.
అప్పటివరకూ భద్రతా బలగాలకు చలపతి పేరు వినడమే కానీ అతను ఎలా ఉంటాడో తెలియదు. కానీ మే 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత స్వాధీనం చేసుకున్న ఒక పాడుబడిన స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెల్ఫీ దొరికింది. దీని ఆధారంగా చలపతిని గాలించిన భద్రతా దళాలు నిన్న ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టాయి.












Click it and Unblock the Notifications