మాజీ సీఐడీ బాస్ కు చంద్రబాబు షాక్-హైకోర్టు బెయిల్ ఇవ్వగానే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు కూటమి సర్కార్ షాకిచ్చింది. ఇప్పటికే ఆయనపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో సస్పెండ్ చేసిన ప్రభుత్వం దాన్ని పొడిగిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు ఆయన అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.
గతంలో సీఐడీ బాస్ గా పనిచేసిన సమయంలో అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని సంజయ్ పై ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా గతంలో డిసెంబర్ 3న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అవి కొనసాగుతుండగానే హైకోర్టులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చింది. సంజయ్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేసినప్పుడు అధికార దుర్వినియోగం చేసి రూ.1.75 కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసిన కేసులో సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారించి ఈ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే సంజయ్ సస్పెన్షన్ ను మే 31 వరకూ అంటే మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో సంజయ్ సస్పెన్షన్ మే 31 వరకూ కొనసాగబోతోంది. గత ప్రభుత్వ హయాంలో మార్గదర్శి సహా పలు చిట్ కంపెనీలపై చర్యల్లో సంజయ్ కీలకంగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications