ఆపరేషన్ సక్సెస్? నేతలకు జనసేన కీలక ఆదేశాలు..!
ఏపీలో రాజకీయ పార్టీగా ఆవిర్భవించి దశాబ్దం పూర్తి చేసుకున్న జనసేన గత ఎన్నికల ముందు నుంచీ రాటుదేలుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో ఆరితేరిపోతోంది. గత ఎన్నికలకు ముందు ఉప్పూ నిప్పుగా ఉన్న టీడీపీ, బీజేపీని కలిపి కూటమి ఏర్పాటు చేసినా, ఎన్నికల్లో ఎత్తుకు పై ఎత్తులతో ఘన విజయాలు అందుకున్నా, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందినా జనసేన చేస్తున్న రాజకీయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
ఇదే క్రమంలో తాజాగా ఏపీలో తలెత్తిన ఓ రాజకీయ సమస్యను తనకు అనుకూలంగా పరిష్కరించే విషయంలో జనసేన వేసిన అడుగులు చర్చనీయాంశంగా మారాయి. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా.. టీడీపీ నేత నారా లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలంటూ ఆ పార్టీ నేతలు తెరపైకి తెచ్చిన డిమాండ్ కు జనసేన తనదైన స్ధాయిలో కౌంటర్ ఇచ్చింది. పవన్ ను సీఎం చేయండి, లోకేష్ ను తప్పనిసరిగా డిప్యూటీ సీఎంను చేద్దామంటూ జనసేన నేతలు ఇచ్చిన కౌంటర్ టీడీపీని ఎక్కడో తాకింది.

దీంతో టీడీపీ తమ పార్టీ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సి వచ్చింది. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎవరూ ప్రస్తుతానికి డిమాండ్ చేయొద్దని, ఏదైనా ఉంటే కూటమిలో మాట్లాడుకుంటామని తేల్చిచెప్పేసింది. టీడీపీ హైకమాండ్ నుంచి ఈ ఆదేశాలు వచ్చిన 24 గంటల తర్వాత జనసేన స్పందించింది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్ పై నోరు మెదపవద్దంటూ తమ పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఎలాగో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసే అంశంపై టీడీపీ నేతలు మాట్లాడరని, కాబట్టి తమ పార్టీ నేతలు కూడా మాట్లాడకుండా ఉండాలనేది దీని సారాంశం.
టీడీపీ నుంచి రాజేష్ మహాసేనతో మొదలుపెట్టి వరుసగా నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇది చివరికి టీడీపీ తమ నేతలకు అడ్డుకట్ట వేసినా దావోస్ లో మంత్రి టీజీ భరత్ దీన్ని మించి పోయి లోకేష్ కాబోయే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు సైతం మంట పుట్టించాయి.
దీనిపై అప్పటికే జనసేన నేత కిరణ్ రాయల్ తిరుపతిలో స్పందిస్తూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నేతలకు ఎలా కోరిక ఉందో, అలాగే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తమకూ ఉందన్నారు. ఇదే మొత్తం ఎపిసోడ్ కు టర్నింగ్ ఇచ్చింది. చివర్లో వైసీపీకి అవకాశం ఇవ్వొద్దంటూ టీడీపీకి ఆయన చేసిన సూచన పనిచేసింది. ఇప్పుడు ఆపరేషన్ పూర్తి కావడంతో జనసేన కూడా వెనక్కి తగ్గింది.












Click it and Unblock the Notifications