రిటర్న్ గిఫ్ట్ తర్వాత.. ముందు ఏపీకి లోకేష్ ను రిటర్న్ రమ్మనండి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నేతలు, చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు అంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇక చంద్రబాబుతో పాటు త్వరలో నారా లోకేష్ కూడా జైలుకు వెళతాడని విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ పై స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు ఇలా చాలా కేసులు ఉన్నాయని , త్వరలో లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా పేర్కొన్నారు.

దీంతో లోకేష్ కచ్చితంగా జగన్ సర్కార్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతానని స్పష్టం చేశారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన వైసిపి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ లోకేష్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిటర్న్ గిఫ్ట్ సంగతి తర్వాత చూద్దాం .. ముందు ఏపీకి రిటర్న్ రమ్మనండి అంటూ సెటైర్లు వేశారు.
తండ్రి జైల్లో ఉంటే కొడుకు ఢిల్లీలో ఖరీదైన లాడ్జిల్లో కులుకు తున్నాడని. ఢిల్లీలో లోకేష్ ఉన్న లాడ్జికి రోజుకు 2లక్షల 25 వేల మధ్య చెల్లించి జల్సా చేస్తున్నాడంటూ మండిపడ్డారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పిఏ అమెరికా పారిపోగా, ఇంకొకరు దుబాయ్ పారిపోయారని, మరొకరు మాయమై పోయారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
తనను అరెస్టు చేస్తారన్న భయంతోనే లోకేష్ ఇన్ని రోజులైనా ఢిల్లీ నుంచి రావడం లేదని, ఢిల్లీలో లోకేష్ దాక్కున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాక్కుని సొల్లు కబుర్లు చెప్పడం కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో తెలుస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications