మర్యాద పాటిస్తున్నాం, మాకూ వచ్చు: టిడిపిపై కిషన్
హైదరాబాద్: ఉగాది తర్వాత తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఆయనతో బుధవారం సిఐఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. బిజెపి మేనిఫెస్టోలో తమ ప్రతిపాదనలు చేర్చాలని సిఐఐ ప్రతినిధులు కిషన్ రెడ్డిని కోరారు. భేటీ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే బిసి సబ్ ప్లాన్‌ను చట్టంగా తీసుకువచ్చి, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు.
పొత్తుల కోసం తమ పార్టీ పాకులాడటం లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఓ వైపు పొత్తులంటూనే విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాము కూడా విమర్శలు చేయగలమని.. అయితే తాము మర్యాద పాటించి అలా చేయడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసేందుకు సినీ ప్రముఖులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారని, ఆయనకు మద్దతు తెలుపుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. సినీ నటుడు సురేష్ కూడా బిజెపిలో చేరుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ చెప్పినట్లుగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాము ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి వెళ్తామని తెలిపారు.

బిజెపి పాలనలో కాలంలో జరిగిన అభివృద్ధి.. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనే విషయాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సాధించిన ప్రగతిని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితిని ప్రజలకు వివరిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న పాలనా పరమైన వ్యత్యాసాలను ప్రజలకు చెబుతామని ఆయన అన్నారు. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్‌ను కూడా తమ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications