రాయలసీమలో వైసీపీ రాజధానుల పోరు-విశాఖ గర్జన తరహాలో 29న తిరుపతిలో సభ
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు కొనసాగుతున్న నేపథ్యంలో విపక్షాలపై పైచేయి సాధించేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో ఓ భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించిన వైసీపీ.. ఇప్పుడు రాయలసీమలోనూ అదే తరహాలో మరో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ నెల 29న మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభతో రాయలసీమలో మూడు రాజధానుల శంఖారావం పూరించాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో తిరుపతి సభనూ అదే స్దాయిలో విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ గర్జనకు రాయలసీమ నేతలు, మంత్రులు హాజరైనట్లే తిరుపతి సభకూ ఉత్తరాంధ్ర నేతల్ని తరలిచేందుకు ప్రయత్నిస్తోంది.

తిరుపతి సభ తర్వాత వచ్చేనెల మొదటివారం నుంచి రాయలసీమలో వైసీపీ కార్యక్రమాల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమలోనూ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర తరహాలోనే రాయలసీమలోనూ నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాలని వైసీపీ భావిస్తోంది. జేఏసీ ఏర్పాటైతే దాని ద్వారా ఈ సమావేశాలు, సభలు నిర్వహించేందుకు వీలు కలుగుతుందని అధికార పార్టీ యోచిస్తోంది.












Click it and Unblock the Notifications