లగడపాటిపై రాళ్లు, చెప్పులు: తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జ్
విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు లగడపాటి రాజగోపాల్‌కు శనివారం ఆటోనగర్‌లో సమైక్య సెగ తగిలింది. లగడపాటిని పలువురు సమైక్యవాదులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆటోనగర్‌లో లారీ ఓవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు జరుగుతున్నాయి.
వారికి సంఘీభావం తెలిపేందుకు లగడపాటి వచ్చారు. ఈ సమయంలో పలువురు సమైక్యవాదులు ఆయనను అడ్డుకొని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజీనామా చేసే వరకు తాము అడుగు పెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. వారికి సర్దిచెప్పేందుకు లగడపాటి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఓ దశలో లగడపాటి వర్గీయులు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడున్న కుర్చీలు తదితరాలు విరిగిపోయాయి. ఆందోళనకారులు లగడాపాటి పైకి చెప్పులు, రాళ్లు, కుర్చీలు విసిరేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను అక్కడి నుండి తరిమివేసే ప్రయత్నాలు చేశారు.
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు లగడపాటిని అక్కడి నుండి వెళ్లిపోవాలని కోరారు. తాను మొదటి నుండి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని, దానిని వారికి వివరిస్తానని చెప్పారు. సమైక్యవాదులు వినిపించుకోక పోవడంతో ఉద్రిక్తత తగ్గించేందుకు పోలీసులు ఆయనను అక్కడి నుండి బలవంతంగా తరలించారు.












Click it and Unblock the Notifications