ఖర్గేతో షర్మిల భేటీ, బాధ్యతలపై క్లారిటీ- కాంగ్రెస్ లో చేరికల జాబితాలో..!!
ఏపీలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కర్ణాటక, తెలంగాణ తరువాత ఇప్పుడు ఏపీ పైన ఫోకస్ చేసింది. షర్మిల ఎంట్రీతో ఎన్నికల వేళ పార్టీలో చేరికల గురించి మంత్రాంగం ప్రారంభించింది. పార్టీ ఓట్ షేర్ పెంచుకొనే వ్యూహాలను అమలు చేస్తోంది. షర్మిలకు అప్పగించే బాధ్యతల పైన ఖర్గే క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ పైన దాదాపు నిర్ణయానికి వచ్చారు. ఇక, పార్టీలో చేరేవారి జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ కార్యాచరణ : ఏపీలో కాంగ్రెస్ తమ కార్యాచరణ ప్రారంభించింది. వైఎస్సార్ ను ఓన్ చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రచారం మొదలు పెట్టింది. ఇక ఫొటో మీద 'మొన్న.. నిన్న.. నేడు' అని ఉండగా మొదటి చిత్రంలో వైసీపీ ప్రచార లోగోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో సంపూర్ణంగా కనిపించింది. ఇక రెండవ చిత్రంలో సీఎం జగన్ ఫొటో వెనుకాల రాజశేఖర్ రెడ్డి కనిపించారు. చివరిదైన మూడో చిత్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖం ఎక్కడా కనిపించలేదు. ప్రచార చిత్రం మధ్యలో వైఎస్ జగన్ ఫొటో మాత్రమే కనిపించింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరిక నేపథ్యంలో షేర్ చేసిన ఈ ఫొటో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

షర్మిలకు మార్గనిర్దేశం : మరో వైపు ఢిల్లీలో మకాం వేసిన షర్మిల ఈ ఉదయం పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ లో సమావేశమయ్యారు. పార్టీలో తన పాత్ర..బాధ్యతల పైన చర్చించారు. ఈ సమయంలో పీసీసీ పగ్గాలు స్వీరించేందుకు సిద్దమేనా అని వేణుగోపాల్ ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలోనూ తన కు ప్రాధాన్యత ఉండేలా చూడాలని షర్మిల కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని షర్మిలకు వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. ఆ తరువాత ఖర్గేతోనూ షర్మిల సమావేశమయ్యారు. ఆ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హాజరయ్యారు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దమని షర్మిల స్పష్టం చేసారు. దీంతో, షర్మిలకు ఏపీ కేంద్రంగానే కీలక బాధ్యలు ఇవ్వాలని భావిస్తున్నామని..మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్లు సమాచారం.
After joining the Indian National Congress, @realyssharmila ji meets Congress President Shri @kharge. pic.twitter.com/MNrqqcSis2
— Congress (@INCIndia) January 5, 2024
ఏపీ కాంగ్రెస్ లో చేరికలు : ఇటు పార్టీలో చేరికల పైన ఖర్గేతో సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ విజయవాడ రానున్నారు. పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పాల్గొనాలని షర్మిలకు సూచించారు. ఇక..పార్టీలో చేరికలను ఆహ్వానించాలని స్పష్టం చేసారు. ఠాగూర్ సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో పాటుగా గతంలో వైఎస్ హాయంలో మంత్రులుగా పని చేసిన మరో ముగ్గురు పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కడప జిల్లా నేత, అనంతపురం జిల్లా నుంచి మంత్రిగా పని చేసి కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహించిన మరో నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో, షర్మిలకు ఖరారు చేసే బాధ్యతలు..భవిష్యత్ అడుగుల పైన రాజకీయంగా చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications