కేంద్రాన్ని ఫిక్స్ చేసిన వైసీపీ ఎంపీ : లోక్‌సభ సాక్షిగా - అదే ఖాయమా..!!
న్యూఢిల్లీ: త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతిని ఇవ్వాళ దేశం మొత్తం జరుపుకొంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కూడా కలిసి రావడంతో కేంద్ర ప్రభుత్వం పింగళి వెంకయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సాయంత్రం దేశ రాజధానిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు.

సీఎం క్యాంప్ ఆఫీస్‌లో..
ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఆయన జయంతి వేడుకలను ఏర్పాటు చేసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా దీన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

లోక్‌సభలో డిమాండ్..
ఇదిలావుండగా- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కొత్త డిమాండ్‌ను వినిపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గల అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు పింగళి వెంకయ్య పేరు పెట్టాలని అన్నారు. లోక్‌సభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్న దేశ పౌరులందరూ మువ్వన్నెల జెండాను తమ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల కిందటే తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు.

కేంద్రం సముచిత గౌరవం..
ఆగస్టు 2 నుంచి 15వ తేదీ వరకు ప్రొఫైల్ ఫొటోలను జాతీయ పతాకంతో మార్చుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నారు. దీన్ని తాము స్వాగతిస్తోన్నామని చెప్పారు. అలాగే- ఈ ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి పౌరుడు తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని కోరారని వల్లభనేని బాలశౌరి అన్నారు. దేశ ప్రజలకు పిలుపునివ్వడం వల్ల ప్రధాని మోడీ.. పింగళి వెంకయ్యను గౌరవించినట్టయిందని పేర్కొన్నారు.

మంగళగిరి ఎయిమ్స్‌కు..
అదే సమయంలో- గుంటూరు జిల్లా మంగళగిరిలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌కు పింగళి వెంకయ్య పేరును పెట్టాలని, ఇది ఆయన కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడించినట్టవుతుందని వల్లభనేని బాలశౌరి అన్నారు. పింగళి వెంకయ్య జన్మించిన గ్రామం తన నియోజకవర్గం పరిధిలోనే ఉందని, అందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌కు ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications