గందరగోళమొద్దు: పవన్ సభ, కాకినాడలో ఆంక్షలు, ప్యాకేజీపై ఎలా..
కాకినాడ: సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరిట భారీ బహిరంగ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ గురువారం రాత్రే కాకినాడ చేరుకున్నారు. నగరంలోని జీటీఆర్ హోటల్లో బస చేశారు.
ప్యాకేజీ వెనుక..: బాబు వ్యూహం-భయం, పవన్ ఏమంటారు?
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్న తరుణంలో ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ భవిష్యత్తు చేపట్టనున్న కార్యాచరణ ఏమిటన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. పవన్ స్పందన ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది.
ట్రాఫిక్ ఆంక్షలు
కాకినాడలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. గురువారం నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలి వచ్చారు. ఇంకా వస్తున్నారు. పవన్ బస చేసిన హోటల్ వద్దకు అభిమానులు చేరుకున్నారు. అక్కడ జనసందోహం కనిపిస్తోంది.

జైఎన్టీయు క్రీడా మైదానంలో సభ నిర్వహణకు జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణంలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా మూడు అంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో మహిళలు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా బారికేడ్లు నిర్మించారు.
నిన్న సాయంత్రం నుంచే కోలాహలం
గురువారం సాయంత్రం పవన్ వచ్చినప్పుడు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పవన్ కారు నుంచి దిగేందుకు కూడా వీలులేక పోవడంతో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. అతికష్టంపై పోలీసులు ఆయనను హోటల్ లోపలకు పంపించారు.
గురువారం ఉదయం నుంచే సభా ప్రాంగణం కోలాహలంగా మారింది. జేఎన్టీయు గ్రౌండు వైపు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కాకినాడ డీఎస్పీ తెలిపారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లను గురువారం ఏఎస్పీ దామోదర్ పర్యవేక్షించారు.
ప్రశాంతంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి
గురువారం సాయంత్రం జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య సమన్వయ సమావేశం జరిగింది. సభా ప్రాంగణంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సూచనలు చేశారు. పోలీసులకు సహకరించాలని వారు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
ర్యాలీలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, మైకులు, లౌడ్ స్పీకర్లతో గందరగోళ వాతావరణం చోటుచేసుకోకుండా చూడాలని కోరారు. సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాటకు అవకాశం లేకుండా వలంటీర్లుగా పవన్ ఫ్యాన్స్ పోలీసులతో కలిసి పని చేయాలన్నారు.
పవన్ సభకు మద్దతు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మద్దతు ప్రకటించారు. అలాగే, ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ శనివారం ఏపీవ్యాప్త బందుకు ఏపీలోని విపక్షాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications