సంక్రాంతి వేళ అమలాపురానికి అనుకోని అతిథి..!
ఏపీలో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతున్నాయి. ఏడాదికోసారి వచ్చే పెద్ద పండుగ కావడంతో చిన్నా, పెద్దా అంతా పండుగ హడావిడిలో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ఆ సందడే వేరు. కోడి పందాలతో మొదలుపెట్టి ప్రతీదీ సంప్రదాయమే, విశేషమే. అలాంటి గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఇవాళ ఓ అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. దీన్ని చూసి అక్కడి వారు అవాక్కయ్యారు. వెంటనే సెల్ ఫోన్లు చేసి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టేశారు.
ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా ? ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా సంస్థ తీసుకొచ్చిన తాజా మోడల్ కారు. టెస్లా కంపెనీకి చెందిన సైబర్ ట్రక్ అమలాపురంలో సందడి చేస్తోంది.భారత్‌లో అత్యంత అరుదుగా కనిపించే ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు అమలాపురానికి రావడంతో దీన్ని చూసేందుకు స్థానికులు భారీగా ఎగబడ్డారు.ప్రముఖ పారిశ్రామికవేత్త, అమలాపురం అల్లుడు కూడా అయిన ఆదిత్య రామ్ సంక్రాంతి వేడుకల కోసం ఈ వాహనంలో రావడంతో పట్టణ వీధులన్నీ సందడిగా మారాయి.

భారత్ లో టెస్లా కార్ల రాక గతేడాది ప్రారంభమైంది. స్థానికంగా టెస్లా కార్ల విక్రయాలు ప్రారంభించినా స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ముంబై తర్వాత ఇతర నగరాలకు విక్రయాల్ని విస్తరించే విషయంలో టెస్లా ఆలోచనలో పడుతోంది. అయినా ఇండియాలో టెస్లా కార్లకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. కానీ వాటి ధరలు, పన్నులు, స్థానికంగా ప్రయాణం విషయంలోనే జనం భయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో టెస్లా మోడల్ Y కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అమ్మకాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications