ఆరవ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో; సోమవారం పాదయాత్రకు బ్రేక్, ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఉదృతంగా మారుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని రాజధాని రైతులు చెయ్యని ప్రయత్నాలు లేవు. న్యాయస్థానం టూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టి ముందుకు నడుస్తున్నారు. ఈరోజు అమరావతి రైతు మహా పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ప్రజల మద్దతుతో ఉత్సాహంగా కొనసాగుతుంది.

ఆరో రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర
శనివారం నాడు ప్రకాశం జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్ర సాగిస్తున్న రైతులకు దారి పొడుగునా పలువురు పూలతో స్వాగతించి సంఘీభావాన్ని ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, సీపీఐ , సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పలువురు సంఘీభావం ప్రకటించారు .రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అన్న ఆకాంక్షను వివిధ జిల్లాల ప్రజల మద్దతుతో ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ప్రజల మద్దతుతో పాదయాత్ర సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న ప్రాధాన డిమాండ్ తో అమరావతి ప్రాంత రైతుల మహా పాదయాత్ర గుంటూరు జిల్లా దాటింది.

ఆరోరోజు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర .. పెందనదిపాడు నుండి పర్చూరుకు
అమరావతి ప్రాంత రైతులు తమ ఉద్యమాన్ని విస్తరించడానికి నిర్వహిస్తున్న మహా పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లా ను దాటి ప్రకాశం జిల్లాలో ప్రవేశించనుంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సీఆర్డీఏ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర లో భాగంగా శనివారం నాడు పెదనందిపాడు లో ప్రారంభమైన యాత్ర పర్చూరులో ముగియనుంది. మొత్తం 14 కిలోమీటర్ల మేర పాదయాత్రను అమరావతి రైతులు సాగించనున్నారు.

ఆదివారం రాత్రికి ఇంకొల్లుకు చేరుకోనున్న పాదయాత్ర
సేవ్ అమరావతి నినాదంతో ఉద్యమం చేస్తున్న రైతులు తుళ్లూరు లో ప్రారంభించిన పాదయాత్రకు, అడుగడుగునా ప్రజలు మద్దతు పలికారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రైతుల పోరాటానికి మద్దతుగా పలువురు సంఘీభావం ప్రకటించారు. ఒక్క అధికార వైసీపీ మినహాయించి ప్రతిపక్ష పార్టీలన్నీ రాజధాని రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
ఇదిలా ఉంటే 45 రోజుల పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ప్రధాన గ్రామాల మీదుగా సాగనున్న పాదయాత్ర ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చేరుకుంటుంది.

సోమవారం రైతుల మహాపాదయత్రకు సెలవు
కార్తీక సోమవారం కావడంతో రైతు మహా పాదయాత్ర కు సోమవారం నాడు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణ ధ్యేయంగా సాగుతున్నా మహా పాదయాత్ర తిరిగి మంగళవారం నాడు ఇంకొల్లు నుండి ప్రారంభం కానుంది. ఆరు రోజులుగా అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రకు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడం లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర తో నైనా ప్రభుత్వం కళ్లు తెరుచుకోవాలని, జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications