'సుప్రీం'లో కీలక మలుపు తిరగనున్న అమరావతి?
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మూడున్నర సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించింది. అప్పటి నుంచి రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని, అభివృద్ధి చేయాలంటూ వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి గ్రామాల్లో వారు నిరసన శిబిరాలను నిర్వహిస్తున్నారు.

రైతుల సెంటిమెంట్ ను పరిగణించిన సుప్రీంకోర్టు
రాజధాని నిర్మాణం 6 నెలల్లో పూర్తిచేయాలని, భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలను అప్పగించాలంటూ ఇటీవలే హైకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టును సమయం విషయంలో తప్పు పట్టిందికానీ రాజధాని విషయంలో తప్పు పట్టలేదు. అక్కడి రైతుల సెంటిమెంట్ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ జనవరిలోనే మరోసారి సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశం విచారణకు రానుంది.

చంద్రబాబు, పవన్.. అమరావతికే..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో అమరావతికే కట్టుబడివున్నామని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా ఆయన పర్యటనలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ అమరావతి రైతులకే మద్దతు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాటను కొనసాగనివ్వమని హెచ్చరిస్తున్నారు.

వైసీపీలో చర్చనీయాంశంగా..
చిత్రంగా తెలుగుదేశం, జనసేనకన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే అమరావతి విషయం చర్చకు వస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకోసం పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాజధాని రైతులు కూడా సుప్రీం తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. తీర్పును బట్టి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? ఎన్నికలకు ముందు అమరావతి అజెండా అయితే నష్టమని, దీనికి విరుగుడుగా మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల్లో ముఖ్యమైన అంశంగా చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications