Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..!
అమరావతికి (Amaravati)రాజధానిగా చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఇవాళ ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని, ఇందులో ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రికీ పంపారు.
ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా, త్వరితగతిన సొంత రాజధాని నిర్మాణం చేయాలని అమరావతికి వచ్చామని తెలిపారు. 9 నెలల్లో ఈ అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పాడని, కానీ రోజుకో మాట ఊసరవెల్లి రాజకీయాలు చేశాడని గుర్తుచేశారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేశాడన్నారు.

వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చని, రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించానన్నారు. అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంటు తీసుకుంటుందని ప్రధాని భరోసా ఇచ్చారని,రైతులు ఇచ్చింది భూములు కాదు రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మితం అవుతుందని చెప్పామని, అదే జరిగి తీరుతుందని తెలిపారు. రాజధాని వల్ల ఏం జరుగుతుందనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఏడాదికి 1.05 లక్ష కోట్ల మేర వస్తున్న ఆదాయం చూడాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా అమరావతి ఉంటుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications