రెండో రోజు కొనసాగుతున్న రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర; ఈ రోజు షెడ్యూల్ ఇలా!!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో రైతులు తుళ్లూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు 17 రోజులపాటు పాదయాత్ర నిర్వహించనున్నారు. సోమవారం తొలి రోజు పాదయాత్రలో భాగంగా రాజధాని రైతులు 14.5 కిలోమీటర్ల మేర నడిచి పాదయాత్రను కొనసాగించారు. రైతుల సాగిస్తున్న మహా పాదయాత్రకు టిడిపి, కాంగ్రెస్, జనసేన, సిపిఎం, సిపిఐ, బిజెపి, దళిత బహుజన ఫ్రంట్ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి.

రెండో రోజు ప్రారంభమైన మహా పాదయాత్ర
తొలి రోజు పాదయాత్రలో భాగంగా తుళ్లూరు లో 9 గంటల 5 నిమిషాలకు మహా పాదయాత్రగా బయలుదేరిన రైతులు పెదపరిమిలో మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఇక రెండో రోజు పాదయాత్ర ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఈరోజు తాడికొండ నుండి గుంటూరు శివారు ఈ ప్రాంతం వరకు 12.6 కిలోమీటర్ల పాదయాత్రను రైతులు చేయనున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రధానంగా రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నవంబర్ 1 నుండి నవంబర్ 17 వరకు సాగనున్న మహాపాదయాత్ర
జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి అభివృద్ధికి భూములిచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 రోజుల మహా పాదయాత్రకు రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. ఈ నెల 1 వ తేదీ నుండి 17 వరకు తిరుమలకు వెళ్ళనుండగా, ఆపై తిరుగు ప్రయాణం అయ్యి యాత్ర ముగిసే సరికి మొత్తం 45 రోజులు కానుంది. ఈ పాదయాత్ర నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. నేడు రెండవ రోజు పాదయాత్రను ప్రారంభించారు.

అమరావతి రైతులకు చంద్రబాబు మద్దతు
ఇప్పటికే రైతుల పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు తన సంఘీభావాన్ని ప్రకటించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, రాజధాని అమరావతి లేకపోతే రాష్ట్రం అంధకారమయంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయాన్ని విరమించుకోవాలని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత ఒత్తిడికి గురి చేసినా చెక్కుచెదరని విశ్వాసంతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని చెప్పిన చంద్రబాబు అమరావతిని, పోలవరాన్ని లేని ఆంధ్రప్రదేశ్ ను ఊహించుకోలేం అంటూ పేర్కొన్నారు.
Recommended Video

షరతుల మధ్య కొనసాగుతున్న మహా పాదయాత్ర
అమరావతి పరిరక్షణ సమితి మరియు రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నవంబరు ఒకటవ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతుల మహా పాదయాత్రలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, అలాగే తిరుమల తిరుపతి వెంకన్నకు రాజధాని రైతులు తమ గోడు వినిపించుకోవాలని చేస్తున్న మహా పాదయాత్ర పోలీసులు ఇచ్చిన అనుమతి ప్రకారం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ముగించాలి.
ఇక ఇదే సమయంలో రాజధాని అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర పై పోలీసుల నిఘా ఉంటుంది. పాదయాత్ర నిర్వహించిన ప్రాంతంలో పోలీసుల వీడియో చిత్రీకరణ కొనసాగుతుంది. అనుమతి తీసుకున్న రైతులు తప్ప మిగతా ఎవ్వరూ పాదయాత్రలో పాల్గొనడానికి వీల్లేదు. వివిధ నిబంధనల మధ్య రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగనుంది.












Click it and Unblock the Notifications