సుప్రీంకోర్టు తలుపు తట్టిన అమరావతి రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆరునెలల్లోగా రాజధానిలోని భూములను అభివృద్ధి చేసి రైతులకు సంబంధించిన ప్లాట్లను వారికి కేటాయించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆరునెలల్లో పనులు పూర్తికావడం వీలుకాదని, అందుకు కొన్ని వేలకోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది.
రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోన్న ప్రభుత్వం హైకోర్టు తీర్పును ధిక్కరించిందని, ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తుండటంవల్ల వందల కోట్లు, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఉంచిన ఇసుక, ఇనుము, తదితరాలను ఇప్పటికే కొంతమంది తరలించుకుపోయారని అందులో వివరించారు. 29 గ్రామాల్లోని వేలమంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారని, అవి అభివృద్ధి చెందకపోవడంవల్ల తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా తమ పిటిషన్ ను విచారణకు స్వీకరించాల్సిందిగా కోరారు.

Recommended Video

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ దాదాపు వెయ్యిరోజులుగా రైతులు ఉద్యమ బాట పట్టారు. 29 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి దీక్షలు చేపట్టారు. వీరిని ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డగిస్తుండటంతో కోర్టులను ఆశ్రయించి తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే 45 రోజులపాటు కొనసాగించిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు కూడా ఏపీ హైకోర్టు అండగానే కొనసాగించారు.












Click it and Unblock the Notifications