అమరావతి రైతుల తాజా డిమాండ్స్..! సర్కార్ కు డెడ్ లైన్..!
ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల్ని తిరిగి ప్రారంభించిన కూటమి సర్కార్.. ఇప్పుడు వాటిని పరుగులు తీయిస్తున్నట్లు చెబుతోంది. అయితే రైతుల విషయంలో మాత్రం ఆశించిన స్ధాయిలో న్యాయం జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు తాజాగా మరోసారి తమ గళం వినిపించారు. ప్రభుత్వానికి ఈసారి బహిరంగంగానే పలు డిమాండ్లు చేశారు. రేపు సీఆర్డీఏ భేటీ వేళ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అమరావతి రైతుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య విధానంపై ఇవాళ గుంటూరులో జరిగిన అమరావతి రైతు జెఎసి సమావేశం పలు తీర్మానాలు చేసింది. ప్రభుత్వ తీరుపై అమరావతి రైతులు తొలిసారి తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, సీఆర్డీయేలో అవినీతి పెరిగిందని తీర్మానించారు.పది రోజుల్లో ప్రభుత్వం స్పందించక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు.

కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. అనేకసార్లు సిఆర్‌డిఏ అధికారులు, మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణకు వినతిపత్రాలు ఇచ్చినా, గ్రీవెన్స్ సదస్సులలోనూ, వారి దృష్టికి తీసుకువచ్చినా నేటి వరకూ పరిష్కారం కాలేదన్నారు. అసైన్డ్ రైతుల సమస్య, కౌలు చెల్లింపు క్రమబద్దీకరణ, రోడ్డుపోటు ప్లాట్ల సమస్య, ప్లాట్ల కేటాయింపు సమస్య, గ్రామ కంఠాల సమస్య, అసంబద్ధమైన ఎఫ్‌ఎస్‌ఐ విధానం, ఇతర సమస్యల పట్ల అధికారుల, ప్రభుత్వ అలసత్వ ధోరణి, క్రిందిస్తాయి అధికారుల అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతులు, రైతు కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపించిన రైతుల భాగస్వామ్యం, స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వల్ల రైతులు, రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారని వారు తెలిపారు. అమరావతి ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి)పై తీవ్ర ఒత్తిడి వస్తున్నందువల్ల ఇవాళ గుంటూరులో జేఏసీ సమావేశమై పలు డిమాండ్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. వీటిని తాము ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు.

సీఎం, డిప్యూటీ సీఎం, మున్సిపల్‌శాఖ మంత్రి, సంబంధిత ప్రజాప్రతినిధులు రైతు జేఏసీతో రానున్న పదిరోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు. రైతు సమస్యలు పరిష్కారం గురించి చర్చించి కాలవ్యవథిని నిర్ణయించి అమలు చేయాల్సిందిగా డిమాండు చేశారు. ప్రతి రెండు నెలలకు రైతు జెఎసితో సంయుక్త సమావేశం జరపాలని, ఆ సమావేశంలో పురోగతిని సమీక్షించాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భూ సమీకరణకు భూమి ఇచ్చిన రైతులు, రైతు కూలీల విస్తృత సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించాలని తీర్మానం చేశారు.












Click it and Unblock the Notifications