అమరావతి జేఏసీ అల్టిమేటం -అమెరికా తానా సభల్లో రాజధాని నినాదాలు..!!
ఏపీలో ఎన్నికల వేళ అమరావతి జేఏసీ అల్టిమేటం ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో అమరావతిపై హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు ఇస్తామని ప్రకటించింది. రాజధాని రైతులకు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని కోరింది. రాజధాని పోరాటంలో వంద శాతం రైతులే గెలుస్తారని పేర్కొంది. ఎన్నికల్లో అమరావతి అంశమే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. అమెరికాలో జరుగుతున్న తానా సమావేశాల్లోనూ అమరావతికి అనుకూలంగా నినాదాలు వినిపించాయి.
అమరావతి అంశమే కీలకపాత్ర: ఏపీలో జరిగే ఎన్నికల్లో అమరావతి అంశమే కీలకపాత్ర పోషిస్తుందని..దీనిని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలకే మద్దతివ్వాలని రాజధాని ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి అన్ని నియోకజవర్గాలకు వ్యాపింప చేయాలని రైతులకు దిశానిర్దేశం చేసారు.

రాజధాని అమరావతి రైతుల ఉద్యమం 1,300వ రోజుకు చేరుకున్న సందర్భంగా జరిగిన సభకు పాలు పార్టీల నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించటం సీఎం జగన్ కు సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. అయిదు కోట్ల ఆంధ్రులు అమరావతికి మద్దతుగా నిలవాలని అభ్యర్ధించారు.
మద్దతుగా నిలవాలి: సుప్రీంకోర్టు కేసులో కూడా నెలరోజుల్లోపే నూటికి నూరుపాళ్లు అమరావతే రాజధాని అని ధర్మాసనం తేల్చి చెబుతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేసారు. రాజ్యాంగం, కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా తాను చేసిన వాగ్దానాలను పక్కకి నెట్టి అహంభావంతో జగన్ మూడు రాజధానులకు తెరలేపారని విమర్శించారు.
కచ్చితంగా ప్రభుత్వం మారుతుందన్నారు. ఆ తరువాతే రాజధాని అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. అంతే తప్ప జగన్ ఏదైనా చేస్తాడని మాత్రం భ్రమలకు గురికావద్దని పేర్కొన్నారు. ఏం జరిగినా తిరిగి వైసీపీ అధికారంలోకి రాకూడదని చెప్పపుకొచ్చారు. వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు.
తానా సభల్లోనూ నినాదాలు: రాజధాని కోసం 1,300 రోజుల పాటు ఉద్యమం చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఇతర పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. అమరావతి ఉద్యమ చరిత్రలో నిలిచిపోతుందని పలువరు నేతలు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీల మధ్య కాదని...జగన్ పాలన కావాలా ..వద్దా అనే అంశం పైనే జరుగుతాయని పేర్కొన్నారు.
అమరావతే రాజధాని అని మేనిఫెస్టోలో ప్రకటించిన పార్టీలనే గెలిపించాలని, అలాకాని పార్టీలను ఓడించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అటు అమెరికా తానా సభలకు హాజరైన పలువురు ప్రతినిధులు జై అమరావతి..జై జై అమరావతి అంటూ నినాదాలు చేయటం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications