Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం-తొలి కంప్యూటర్ అప్పుడే..!
అమరావతిలో సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు అయిన క్వాంటం వ్యాలీ (quantum valley)కి ఇవాళ తొలి అడుగు పడింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి చంద్రబాబు ఇవాళ ఈ కీలక ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన బృందాలకు సర్టిఫికెట్లతో సహా నగదు బహుమతుల చెక్కుల్ని అందజేశారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీ
2026 డిసెంబరు నుంచి ఏపీలో తొలి క్వాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
క్వాంటం కంప్యూటర్ల తయారీ కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. 85 శాతం మేర క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను దేశానికి, ప్రపంచానికి తయారు చేసి ఎగుమతులు చేసే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 14న ఇంటర్నేషనల్ క్వాంటం డే రోజున 2 ఇండీజినస్ క్వాంటం కంప్యూటర్లను రెఫరెన్సు ఫెసిలిటీ గా ఎస్ఆర్ఎం నుంచి ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. క్వాంటం ద్వారా చేసిన ఆవిష్కరణలు నోబెల్ ప్రైజ్ సాధిస్తే రూ.100 కోట్ల నజరానా ఇస్తామని మరోసారి తెలిపారు. యువ మేధావులు దీనిపై పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు.

ఏపీలో క్వాంటం డిమాండ్
2030 నాటికి 2.5 లక్షల మంది క్వాంటం నిపుణులు అవసరం అవుతారని చంద్రబాబు అంచనా వేశారు. వైజర్ సంస్థ ద్వారా క్వాంటం కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు పిలుపునిస్తే 50 వేల మంది నేర్చుకుంటున్నారని తెలిపారు.ఐఐటీ మద్రాస్ అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కోర్సులు అందించినప్పుడు దేశవ్యాప్తంగా 2.08 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని, వారిలో 1.04 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వారే అన్నారు. దశల వారీగా 35 లక్షల మందికి క్వాంటంలో శిక్షణ ఇచ్చేందుకు వైజర్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు క్వాంటం ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం ముందుకు వచ్చిందన్నారు అందులో 10 లక్షల మంది ఏపీ యువతకు శిక్షణ ఇస్తామన్నారు.

ప్రభుత్వ ప్రయత్నాలు
ఏపీలోని విద్యార్ధులంతా ఏఐ అల్గారిథమ్స్ లో శిక్షణ పొందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఒక్కటే కాదు, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్, సెమీ కండక్టర్స్ ఉత్పత్తి లాంటి అంశాల్లో ఇప్పటికే ముందడుగు వేశామన్నారు. అమరావతి డీప్ టెక్నాలజీ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పరిశ్రమల్ని, విద్యా రంగాన్ని, విద్యార్ధుల్ని కోరారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భారత క్వాంటమ్ భవిష్యత్తుని నిర్దేశించే ప్రదేశంగా మారుతుందన్నారు. క్వాంటం వేగంతో నిర్ణయాలు తీసుకుంటామని, క్వాంటం వేగంతోనే పనులు జరిగేలా చూస్తామని బాబు ప్రకటించారు.












Click it and Unblock the Notifications