రాజధాని అమరావతి పోరాటం... మరో రైతు కూలీ ఆత్మహత్య .. గ్రామాల్లో ఉద్రిక్తత
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి 29 గ్రామాల రైతులు ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి . నిరసనలు, అరెస్ట్ లతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అమరావతి చుట్టూ ఉన్న 29 గ్రామాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది . రాజధాని కోసం పోరాటం చేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల కుటుంబాల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.కొందరు రైతులు మనస్తాపంతో గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

వేమూరి గోపి అనే రైతు కూలీ మందడంలో ఉరేసుకుని ఆత్మహత్య
రాజధానిలో రైతులు, కౌలు రైతులు తీవ్ర మానసిక వేదనతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక నేడు రాజధాని కోసం పోరాటం చేస్తున్న మరో రైతు కూలీ ఆత్మ హత్యకు పాల్పడ్డారు . రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు కూలీ నేడు ప్రాణాలు కోల్పోయారు .వేమూరి గోపి అనే రైతు కూలీ మందడంలో ఉరేసుకున్నాడు. కొంతకాలంగా ఉద్యమంలో గోపి చురుగ్గా పాల్గొంటున్నాడు. రాజధాని తరలింపుపై మనస్తాపంతోనే గోపి బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గోపీ ఉద్యమ సమయంలో డిమాండ్ చేశారు .

రాజధాని అమరావతి నుండి వెళ్ళిపోతే జీవనం ఎలా అన్న ఆందోళన
రాజధాని అమరావతి నుండి వెళ్ళిపోతే జీవనం ఎలా అన్న ఆందోళనలో ఉన్న రాజధాని ప్రాంత రైతులు తీవ్రమనస్తాపానికి గురవుతున్నారు. ఇక మరోవైపు అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతుంది. తుళ్లూరు, మందడం లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తుళ్లూరు నుంచి కనకదుర్గ గుడికి రైతులు, మహిళలు పాదయాత్రగా వెళ్తుంటే మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. రైతులపైనా.. మహిళలపైన లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. అక్కడితో ఆగకుండా అందర్నీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు, రైతులు వాహనాలు అడ్డుపడి నిరసనలు తెలిపారు.

11 మంది మృతి ..రాజధాని గ్రామాల్లో మోగుతున్న చావు డప్పు
ఇదే క్రమంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు 11 మంది రైతులు రాజధాని కోసం ప్రాణాలు విడిచారు. రాజధాని గ్రామాల్లో చావు డప్పు మోగుతున్నా, రాజధాని అమరావతి కోసం రైతులు ప్రాణాలు విడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనిరైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పాకిస్థాన్‌లో ఉన్నామా .. భారత్‌లోనే ఉన్నామా అని రైతులు నిలదీస్తున్నారు. పోలీసుల దాడులు, జగన్ నిర్లక్ష్యం వారిని మరింత వేదనకు గురి చేస్తున్నాయి..












Click it and Unblock the Notifications