సాయం ఏమూలకు, ఏపీకి భిక్షమేస్తున్నారా?: చంద్రబాబుపై మండిపడ్డ అంబటి
అమరావతి: ఏపీకి కేంద్రం సాయంతో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఆర్ధిక సాయం పేరుతో ఏపీకి భిక్షమేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తోన్న సాయాన్ని చూసి సంతోషపడాలో లేక బాధపడాలో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు.
సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను తీసుకుంటూ ఏపీకి ప్రత్యేక హోదా పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్రానికి హోదాపై ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతూ డ్రామా ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల ముందు హోదా కోసం పోరాడుతున్నామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలను కూడా అమలు చేయకపోతే ఎలా? అని అంబటి ప్రశ్నించారు.

హోదా సెంటిమెంట్ ఏపీ ప్రజల్లో బలంగా ఉందని, హోదా ఎప్పుడిస్తారా అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. అటు కేంద్రం, ఇటు టీడీపీ నేతలు కాకమ్మ కబుర్లు చెబుతున్నారని ఆయన అన్నారు. 'హోదా తీసుకురాగలితే తీసుకురండి, లేదంటే ఎన్డీఏలో కొనసాగకండి, అందరం కలిసి పోరాడదాం' అని ఆయన వ్యాఖ్యానించారు.
జాతీయ ప్రాజెక్టు పేర్కొన్న పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం పేరుతో భిక్షం తీసుకోవడం కాదు, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను సాధించుకోవాలని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రచారం కొనసాగుతోందని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో గురువారం కేంద్రం ఆ రాష్ట్రానికి రూ.1,976 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం, ఏపీ ఆర్థిక లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు కేటాయించిన కేంద్రం... రాష్ట్రానికి బాసటగా నిలుస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications