కోర్టుకు జగన్ టైమిచ్చారా ? స్పెషల్ ఫ్లైట్ ఎలా? అంబటి స్ట్రాంగ్ కౌంటర్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు హాజరు కోసం వెళ్లిన నేపథ్యంలో అధికార టీడీపీ నేతలు విమర్శలకు దిగారు. జగన్ కోర్టుకు వెళ్తూ షెడ్యూల్ ప్రకటించడం జడ్జీల్ని బెదిరించి మళ్లీ రాకుండా ఉండేందుకే అని విమర్శించారు. అలాగే లక్షల రూపాయలు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లడంపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. దీనికి వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు.
వైయస్ జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక..తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని అంబటి రాంబాబు ఆరోపించారు. కానీ వారి ఏడుపులే వైయస్ జగన్‌కి ప్రజా దీవెనులుగా మారుతున్నాయని అన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవించి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకాబోతూ అందుకు షెడ్యూల్‌ని విడుదల చేస్తే కోర్టుకే జగన్ టైమిచ్చారంటూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నందున నిబంధనల ప్రకారం జగన్ ఎక్కడికెళ్లినా షెడ్యూల్ విడుదల చేస్తున్న విషయం గుర్తుచేశారు. ఎల్లో మీడియా, కూటమి నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని అణువంత కూడా తగ్గించలేరని అంబటి తెలిపారు. సొంత డబ్బుతో అద్దెకు తెచ్చుకున్న ఫ్లైట్‌లో వైయస్ జగన్ కోర్టుకి వెళితేనే బురదజల్లిన ఎల్లో మీడియాకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రజల సొమ్ముతో వారం వారం స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి వెళ్తుంటే కనిపించలేదా అని ప్రశ్నించారు.
వైయస్ జగన్ కు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న మంచిపేరును, పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో అనుక్షణం తప్పుడు ఆరోపణలు, వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని అంబటి ఆరోపించారు. జగన్ లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకునే సదర్భంగా పర్యటన అనంతరం కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించిందని, ఆ మేరకు తాడేపల్లి నుంచి బయల్దేరి సీబీఐ కోర్టులో హాజరయ్యారని తెలిపారు. . జడ్జి ముందు హాజరైన అనంతరం లోటస్‌పాండ్‌కి వెళ్లి అక్కడ్నుంచి బెంగళూరు వెళ్లిపోయారన్నారు.

కోర్టుకు టైమివ్వడం అనేది ఎవరూ చేయని పని అన్నారు. పరిస్ధితినిబట్టి రోజంతా ఉండాల్సి రావచ్చుని, ఈరోజు 5 నిమిషాల్లోనే కోర్టుముందు హాజరై తిరిగి వచ్చేశారని అంబటి తెలిపారు. వైయస్ జగన్ నాంపల్లి కోర్టుకు వస్తున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతిలే ఎక్కువగా ప్రచారం చేశాయని, ఆ విషయం తెలుసుకున్న జగన్ అభిమానులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారన్నారు. హైదరాబాద్‌లో తమ పార్టీ లేకపోయినా, వైయస్ జగన్ కోసం వచ్చిన అభిమానాన్ని చూసి కూటమి నాయకులకు కళ్లు బైర్లు కమ్మాయన్నారు.












Click it and Unblock the Notifications