చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న టీటీడీ-నెయ్యిపై కీలక నిర్ణయం..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యికి బదులుగా టీటీడీ జంతువుల కొవ్వు వాడిందంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవిదేశాల్లో సైతం చర్చనీయాంశంగా మారిపోయాయి.. అదే సమయంలో టీటీడీ పనితీరుపైనా సందేహలు లేవనెత్తాయి. ఎంత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందని చెప్పుకుంటున్నా అప్పుడు టీటీడీ ఏం చేసిందన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. దీంతో ఇప్పుడు టీటీడీ కూడా వైసీపీతో సమానంగా విమర్శలు ఎదుర్కొంటోంది.
ఎంతో పవిత్రంగా తయారు కావాల్సిన తిరుమల లడ్డూను జంతువుల కొవ్వులు కలిపి అపవిత్రం చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న టీటీడీ ఇప్పుడు ముప్పేట దాడితో హడావిడి చర్యలకు దిగింది. ఇంకా చెప్పాలంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది. తిరుమల లడ్డూ అపవిత్రం కావడానికి కారణమైన నెయ్యి కల్తీని గుర్తించేందుకు బయటి ల్యాబ్ కు పంపడానికి బదులు సొంతంగా తామే ఆ మెషీన్ ను కొనుగోలు చేయాలని టీటీడీ ఇవాళ నిర్ణయించింది.

కోట్ల రూపాయల ఆదాయం కలిగిన టీటీడీ కేవలం రూ.75 లక్షలు విలువ చేసే నెయ్యి కల్తీ పరీక్షల యంత్రాన్ని కొనుగోలు చేయకపోవడం ఇప్పుడు అన్నింటికంటే ఎక్కువ విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు నెయ్యి నాణ్యతను పరీక్షించే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైనా అనుమానం వస్తే నెయ్యి శాంపిల్ ను ఎక్కడో గుజరాత్ లో ల్యాబ్ కు పంపి పరీక్షించాల్సిన పరిస్ధితి. ఈ సమస్య రిపీట్ కాకుండా తామే స్వయంగా కల్తీ నిర్ధారణ యంత్రం కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దీనికి ఆర్డర్ చేయనున్నారు. డిసెంబర్ నాటికి ఈ యంత్రం టీటీడీకి అందుబాటులోకి వస్తుందని అంచనా.












Click it and Unblock the Notifications