అమిత్ షా ప్లాన్: వైయస్ జగన్ పార్టీకి ముప్పే?
హైదరాబాద్: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యూహంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలహీనపరిచే వ్యూహం ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు తిరిగి బలం పుంజుకోకుండా చేసే వ్యూహం కూడా అందులో ఇమిడి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి వ్యూహం కారణంగా మరో నాలుగేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడం వైయస్ జగన్‌కు కత్తి మీద సాము అవుతుందని అంటున్నారు.
ఇప్పటికే పలువురు నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. విశాఖపట్నంలో ప్రధాన నాయకులైన దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణవంటివారు, పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పార్టీకి దూరమయ్యారు. వైయస్ జగన్ సొంత జిల్లాలో కూడా జగన్‌కు దూరమయ్యారు. కందుల సోదరులు ఇప్పటికే పార్టీని వీడారు. జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కూడా జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
నిజానికి, కాంగ్రెసును చీల్చడమే వైయస్ జగన్‌కు కూడా మైనస్ పాయింట్ అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల సమీకరణాలే ప్రధానంగా పనిచేస్తాయి. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సందర్భంలో కూడా ఆ సమీకరణాలే ప్రధానంగా పనిచేశాయి. కమ్మ, రెడ్డి వైరంలో కాంగ్రెసు పార్టీ ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనాన్ని సాధ్యం చేసి, రెడ్డి ఆధిపత్య పార్టీగా అవతరించింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీని కూడా ఇరు ప్రాంతాల్లో తీవ్రంగా దెబ్బ తీసింది. అయితే, రెండు రాష్ట్రాల విలీనం జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా కమ్మ సామాజిక వర్గాన్ని కాంగ్రెసు పట్టించుకోలేదు.
కాపులు, ఎస్సీల బలంతో రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ నెట్టుకుంటూ వచ్చింది. తెలంగాణ, రాయలసీమ రెడ్ల ఆధిపత్యంతో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి ఆధిపత్య పార్టీగా రూపుదిద్దుకుంది. ఈ స్థితిలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. దీంతో కమ్మ సామాజిక వర్గం తెలంగాణలోని బిసీలతో కలిపి ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయం చీలిపోయింది.

అయితే, ఇరు రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం సాధించిన కాంగ్రెసు పార్టీ విభజన ద్వారా తిరిగి సాధించాలని ప్రయత్నం చేసింది. కానీ అది ఎదురు తిరిగింది. జగన్ చీలిపోవడం ద్వారా రెడ్లు కొంత మేరకు దూరమైనా, కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా కొంత మేరకు కాపాడుకుంటూ కాపులు, ఎస్సీల సహకారంతో టిడిపిని దెబ్బ తీయవచ్చునని అనుకుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం నవ్యాంధ్ర ప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పాయి.
నిజానికి, పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వంటి బడా నేత వెళ్లడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ, అదే మొత్తం నవ్యాంధ్ర ప్రదేశ్ రాజకీయాలను మార్చివేసింది. అదే సమయంలో బిజెపితో పొత్తు మరింతగా కలిసి వచ్చింది. ఎంత లేదన్నా కోస్తాంధ్రలో కమ్మ సామాజిక వర్గం కొంత బిజెపి వైపు ఉంది. బిజెపి జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడి కారణంగానే బహుశా అది సాధ్యమై ఉంటుంది.
కాంగ్రెసు ఓటు బ్యాంకును కోస్తాంధ్ర, రాయలసీమల్లో చీల్చుకున్న జగన్ కాంగ్రెసు పతనానికి దారులు వేశారు. అయితే, కాపులను కూడగట్టుకునే ఆయన వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపి, తెలుగుదేశం పార్టీ వమ్ము చేసింది. అయితే, కాపులకు నాయకత్వం ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీకి కోస్తాంధ్రలో గట్టి పోటీ ఇవ్వాలని చేసిన కాంగ్రెసు ప్రయత్నం కూడా అదే కారణంగా బెడిసి కొట్టింది. చిరంజీవి, బొత్స సత్యనారాయణ ప్రజాదరణ, నాయకత్వ పటిమ పవన్ కళ్యాణ్ దూకుడు ముందు పనిచేయలేదు.
భవిష్యత్తులో కూడా వైయస్ జగన్ గానీ కాంగ్రెసు పార్టీ గానీ పుంజుకోవడానికి అవకాశాలు లేకుండా అమిత్ షా వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు. రాయలసీమలో ఏ మేరకు రెడ్డి సామాజిక వర్గం జగన్ వెంట నడుస్తుందనేది కూడా అనుమానంగానే ఉంది. కమ్మ సామాజిక వర్గం చాలా వరకు తెలుగుదేశం పార్టీ వెంట ఉంటే, బలమైన రెడ్డి, కాపు సామాజిక వర్గాలు బిజెపివైపు మళ్లినా ఆశ్చర్యం లేదు. ఆ ధోరణి ఇప్పటికే కనిపిస్తోంది.
స్థానిక రాజకీయాల వల్ల, కుల సమీకరణాల వల్ల తెలుగుదేశం పార్టీ తనలో ఇముడ్చుకోలేకపోయిన నాయకత్వమంతా బిజెపి వైపు మళ్లే అవకాశాలున్నాయి. అయితే, ఇదే సమయంలో బిజెపి బలపడడం కూడా చంద్రబాబుకు అంతగా ఇష్టం లేకపోవచ్చు. బిజెపిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేరికను చంద్రబాబు అడ్డుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరితే భవిష్యత్తులో తనకు పోటీ కావచ్చుననే ఆలోచన చంద్రబాబులో మెదలి ఉండవచ్చు. దానికితోడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలోకి వస్తే జగన్ బలహీనపడుతున్న మేరకు రాయలసీమలో బిజెపి బలపడే అవకాశాలుంటాయి.
కిరణ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గానికి ప్రధాని నరేంద్ర మోడీ అధికారం, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం కలగలసి బిజెపి బలమైన పార్టీగా ఎదిగే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, తెలుగుదేశం పార్టీ పోటాపోటీ పార్టీలుగా మారినా ఆశ్చర్యం లేదు. అదంతా జగన్ రాజకీయం మీద కూడా ఆధారపడి ఉండవచ్చు. ఆయన ఏ మేరకు పార్టీని పటిష్టంగా ఉంచుకోగలరనేది ప్రశ్న. అదే సమయంలో, కాంగ్రెసు పార్టీ బలపడడానికి తిరిగి జగన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏమైనా, జగన్ గానీ, కాంగ్రెసు నాయకులు గానీ సాధ్యమైనంత త్వరగా మేల్కోకపోతే, బిజెపి అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications