అతను క్యాన్సర్‌ను జయించలేదు: కేశవరెడ్డి కన్నుమూత
నిజామాబాద్: ప్రముఖ నవలారచయిత డాక్టర్ కేశవ రెడ్డి శుక్రవారం ఉదయం కన్ను మూశారు. ఆయన నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు 68 ఏళ్లు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. గత రెండు నెలలుగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. చర్మ వ్యాధులకు సంబంధించిన వైద్యుడైన కేశవ రెడ్డి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని మిషనరీ ఆస్పత్రిలో పనిచేస్తూ పదవీ విరమణ చేశారు.
కేశవ రెడ్డి 1946 మార్చి 10వ తేదీన రాయలసీమలోని చిత్తూరు జిల్లా తలుపులపల్లిలో జన్మించారు. ఆయన భార్య పేరు ధీరమతి. తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో చదివారు. పాండిచ్చేరి వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదివారు. డెర్మటాలజీలో పిజి డిప్లమాను తమిళనాడులోని వెల్లూరులో గల సిఎంసిలో పూర్తి చేశారు. వైద్య విద్యను చదువుతున్నప్పటి అనుభవాలతో ఆయన సిటీ బ్యూటిఫుల్ అనే నవల రాశారు.

గత నెలలో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు చెందిన కేశవ రెడ్డి తెలంగాణలోని నిజామాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన ఎనిమిది నవలలు రాశారు. ఆయన ప్రతి నవలా ఓ సంచలనం. అతడు అడవిని జయించాడు తెలుగు సాహిత్యంపై విశేష ప్రభావం వేసింది. హెమింగ్వే ఓల్డ్ మ్యాన్ అండ్ సీ రచనా శిల్పాన్ని తీసుకుని ఆయన ఈ నవల రాశారు. ఆ విషయాన్ని ఆయన అంగీకరించారు కూడా.
చివరి గుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, ఇన్‌క్రెడిబుల్ గాడెస్, స్మశానం దున్నేరు, రాముండాడు రాజ్యముండాది, మునెమ్మ నవలలు రాశారు. భగవానువాచతో పాటు మరో పెద్ద కథ కూడా రాశాడు. ప్రతి రచన తెలుగు సాహిత్యాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన తెలంగాణలోని నిజామాబాద్‌లో స్థిరపడినప్పటికీ తన ప్రాంతం మాండలికాన్ని వదిలిపెట్టలేదు. ఆ ప్రాంత మాండలికంతో రైతు జీవితాలనే కాకుండా బడుగు బలహీన వర్గాల జీవితాలను తన నవలల్లో అన్ని ప్రాంతాలవారికీ అర్థమయ్యే రీతిలో రచించారు. అన్నింటికన్నా ముఖ్యంగా కేశవ రెడ్డి రచనా నైపుణ్యాన్ని, శైలిని సాధించిన తెలుగు రచయితలు చాలా అరుదు.












Click it and Unblock the Notifications