సూర్యగ్రహణ సమయంలో ఆ కుగ్రామంలో జరిగే అరుదైన వింత..!!
ఖగోళ ప్రేమికులు, అంతరిక్ష పరిశోధకులకు ఆగస్టు 12.. ఓ ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఆ రోజు విశ్వంలో ఒకేసారి నాలుగు అరుదైన అద్భుతాలు చోటు చేసుకోన్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణం ఒక్కటే ఓ అద్భుతం అనుకుంటే.. దాని వెనక మరో నాలుగు ఘటనలు సంభవించబోతోన్నాయి.. ఒక్క రాత్రిలో. ఈ అరుదైన ఖగోళ వింతల కలయిక కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య స్పెయిన్ లోని ఓ కుగ్రామం వార్తల్లో నిలిచింది. అంతరిక్ష పరిశోధకుల కళ్లన్నీ కూడా ప్రస్తుతం ఈ గ్రామం మీదే ఉన్నాయి. గ్రహణాన్ని వీక్షించడానికి ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ వేదికగా మారబోతోంది. భౌగోళికంగా నేడు సంభవించబోయే సూర్య గ్రహణం పాత్ వే కు అతి సమీపంలో ఉండటమే దీనికి కారణం. గ్రామం మీదుగానే సాగుతుందీ గ్రహణం. ఫలితంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ప్రియుల దృష్టి ఇప్పుడీ పల్లెటూరుపై పడింది.

ఆ గ్రామం.. అవెల్లానోసా డి మున్యో. స్పెయిన్ బర్గాస్ రీజియన్ లో ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందిక్కడి వాతావరణం. ఎలాంటి చడీ చప్పుడూ ఉండదు. ఇలాంటిదో పల్లెటూరు ఉందనే విషయం చాలామందికి గుర్తుండదు కూడా. ఇక్కడ నివసిస్తోన్న స్థానికుల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. 10- 12 కుటుంబాలు మాత్రమే ఇక్కడ శాశ్వత ఆవాసాన్ని ఏర్పరచుకున్నాయి. బయటి వ్యక్తులు కూడా పెద్దగా కనిపించరు.
ఈ గ్రహణం.. సూర్యాస్తమయానికి కొన్ని నిమిషాలు ముందు సంభవిస్తుండటం వల్ల భౌగోళికంగా అవెల్లానోసాకు ప్రాధాన్యత ఏర్పడింది. 1912 తర్వాత మొదటిసారిగా సంపూర్ణ సూర్యస్తమయాన్ని చవి చూడబోతోంది కూడా. సరిగ్గా సాయంత్రం వేళ గ్రహణం ఏర్పడటంతో రెండుసార్లు చీకట్లు అలుముకుంటుందీ గ్రామంలో. స్థానికులు ఈ వింతను కళ్లారా వీక్షించనున్నారు. చంద్రుడు సూర్యుడిని కప్పివేయడం ప్రారంభించగానే మొదట పగటి వెలుతురు క్రమంగా మసకబారుతుంది. గ్రహణ సమయం ముగియగానే భానుడి కిరణాలు వెలుతురును ప్రసరిస్తాయి.
గ్రహణం ఛాయల నుంచి బయటపడగానే భానుడి కిరణాలు ప్రసరిస్తాయి గానీ అది కొద్దిసేపే. గ్రహణం పూర్తిగా ముగిసిన మరుక్షణమే సహజ సిద్ధమైన సూర్యాస్తమయమౌతుంది. ఆ గ్రామాన్ని చీకటి తెరలు అలముకుంటాయి. ఈ క్రమంలో అవెల్లానోసా గగనతలం.. వివిధ రంగులను వెదజల్లుతుంది. ఓ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కృతం చేస్తుంది. దీన్ని తిలకించడానికి స్పెయిన్ ప్రజలు.. ఈ గ్రామానికి తరలుతున్నారు.
ఈ గ్రహణం ముగిసిన కొద్ది గంటల్లోనే మరో ఖగోళ వింత ఆకాశంలో సాక్షాత్కరిస్తుంది. ఏటా సంభవించే పెర్సీడ్ ఉల్కాపాతం ఈ రాత్రికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. స్విఫ్ట్ టటిల్ తోకచుక్క అంతరిక్షంలో విడిచిపెట్టిన శిథిలాల గుండా భూమి ప్రయాణించే సమయంలో ఈ ఉల్కాపాతం సంభవిస్తుంది. ఆ రోజు వేలాది తోకచుక్కలు ఆకాశంలో రాలిపడుతూ కనువిందు చేయనున్నాయి. అవెల్లానోసాలో కృత్రిమ వెలుగుల ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో చీకటి నిండిన ఆకాశంలో వేలాది నక్షత్రాలు, వాటి మధ్య తారాజువ్వల్లా దూసుకొచ్చే ఉల్కలు కనువిందు చేయనున్నాయి. ఓ మరిచిపోలేని అనుభూతిగా మిగిల్చనుంది.














Click it and Unblock the Notifications