పవన్ కళ్యాణ్ ను కలవాలని ఎడ్లబండిపై వచ్చిన యువరైతు.. మూడురోజులుగా నిరీక్షణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను నిర్వహిస్తున్న శాఖల వారీగా సంచలన నిర్ణయాలను తీసుకుంటూ సంచలన మార్పులతో కీలకంగా పనిచేస్తున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమ గోడును చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని చాలామంది భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కలవటం కోసం ఎడ్ల బండిపై వచ్చిన యువరైతు
ఈ క్రమంలోనే ఒక యువరైతు దళారీ వ్యవస్థతో రైతులు నష్టపోతున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. రైతులు సాగులో నష్టాన్ని ఎదుర్కోలేక బలవంతపు చావులకు పాల్పడుతున్న తీరుతో తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం 760 కిలోమీటర్లు ఎడ్ల బండి పైన ప్రయాణం చేసి వచ్చాడు.

28 రోజులపాటు 760 కిలోమీటర్లు ప్రయాణం
రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలపడానికి ఓ యువరైతు తన సొంతగ్రామం నుంచి ఎడ్లబండిపై అమరావతికి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం గత మూడు రోజులుగా పడిగాపులు పడుతున్నాడు. శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన నవీన్ కుమార్ అనే యువరైతు దాదాపు 28 రోజులపాటు 760 కిలోమీటర్లు ప్రయాణం చేసి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు.
మూడు రోజులుగా జనసేన కార్యాలయం వద్ద పడిగాపులు
అన్నదాతల సమస్యలను పవన్ కళ్యాణ్ కు చెప్పేందుకు హిందూపురం నుంచి ఎడ్ల బండి పై వచ్చినట్టు ఆయన జనసేన కార్యాలయ సిబ్బందికి తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ ను కలవటం కోసం మూడు రోజులుగా తను ఎదురుచూస్తున్నానని జనసేన కార్యాలయం గేటు బయట చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ ఇబ్బంది పడుతున్నానని తాజాగా వీడియో విడుదల చేశారు.
పవన్ పిలుపు కోసం నిరీక్షిస్తున్న యువరైతు
చలి తీవ్రత కారణంగా ఎడ్లు సైతం అనారోగ్యానికి గురవుతున్నాయని, ఎడ్లకు తినడానికి గడ్డి కూడా దొరకడం లేదని ఆయన చెబుతున్నాడు. రైతుల కష్టాలను వివరించేందుకు తాను పవన్ కళ్యాణ్ ని కలవడానికి వచ్చానని చెబుతున్న యువరైతు పవన్ కళ్యాణ్ ను తను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. రైతు సమస్యలను పవన్ కి తెలపాలని తద్వారా పరిష్కార మార్గాలను వెతకాలని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మంగళగిరి దాకా వచ్చిన యువ రైతుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications