కిరణ్ రెడ్డి బండారమంతా బయటపెడ్తా: ఆనం
హైదరాబాద్: కొత్త పార్టీ పెట్టిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి బండారం బయటపెడతానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. అధికారమే పరమావధిగా భావించే అవకాశవాద నేతలు, వెన్నుపోటుదారులే పార్టీని వీడారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికలకు ముందు రాజకీయ వలసలు మామూలేనని ఆయన అన్నారు.
శాసనసభ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతాయా, రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని అనేది రాష్ట్రపతి, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుదని ఆయన అన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలనే కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నందున కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరిగినా ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణలకు వేర్వేరుగా త్వరలో రెండు పిసిసిలు ఏర్పాటవుతాయని చెప్పారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కించపరిచేలా కిరణ్ మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. కిరణ్ కొత్త పార్టీ గురించి మీడియా ప్రస్తావించగా కిరణ్ కొత్త మార్గం వెతుక్కున్నాక ఆయన చేసిన విమర్శలకు సమాధానం చెపుతానని రామనారాయణరెడ్డి సమాధానమిచ్చారు.
కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తర్వాత తాము ఏం మాట్లాడుతామో, ఎలా మాట్లాడుతామో మీరే చూస్తారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డామనే మచ్చ రాకుండా ఉండేందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. తాము ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. త్వరలో అందరం సమావేశమై భవిష్యత్తుపై చర్చిస్తామన్నారు.












Click it and Unblock the Notifications