జగన్ గురించి తెలియకే అలా చేశాం, సోమిరెడ్డితో విభేదాలు: ఆనం వివేకా
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంచోడో, చెడ్డోడా అన్నది తమకు అనవసరమని, అయితే కచ్చితంగా జగన్ మంచోడు కాదన్నారు.
అప్పట్లో జగన్ గురించి తెలియక అతనిని ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరామన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం అలా చేయకుండా మంచిపని చేసిందన్నారు. తన వరకు తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డియే గురువని చెప్పారు. జగన్‌కు అహంకారం ఉంటుందని ఆరోపించారు.

తాము వైసిపిలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదని, చేయం కూడా అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో జగన్‌ను పోల్చకూడదని చెప్పారు. ఆయనకు జగన్ పూర్తి వ్యతిరేకంగా ఉంటాడన్నారు. తాము ప్రజలతో ఉన్నామని, ప్రజలు తమతో ఉన్నారన్నారు.
జగన్‌కు డబ్బున్నవాళ్లంటే మోజు అన్నారు. తాము కాంగ్రెస్ లో ఉండగా, తమను బయట కూర్చోబెట్టి, డబ్బున్నవారిని లోపల కూర్చోబెట్టి మాట్లాడేవారన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తమ మాటే నెల్లూరులో చెల్లుతుందన్నారు. సొంత జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో తమకు విభేదాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు.












Click it and Unblock the Notifications