వలస వచ్చిన కెసిఆర్ సిఎం, కానీ..: ఆనం వివేకా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి విరుచుకుపడ్డారు. వలస వచ్చిన కెసిఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చు గానీ ఏళ్ల తరబడి స్థానికంగా ఇక్కడే ఉంటున్నవారు స్థానికులు కారని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు.
కెసిఆర్ గతంలో విజయనరం నుంచి వలస వచ్చారని అంటూ అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు గానీ స్థానికంగా ఉంటున్నవారు స్థానికులు కారా అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక అయితే లక్షలాది కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

స్థానికత విషయంలో కెసిఆర్ తన వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు. తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు తాను తుది శ్వాస వరకు కాంగ్రెసులోనే కొనసాగుతామని ఆనం వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు
తాము బిజెపిలోనో, తెలుగుదేశం పార్టీలో చేరుతామంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాము కాంగ్రెసు నుంచి తప్పుకుని ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముల్కీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. స్థానికత, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications