రాయల టీపై చర్చ: దామోదర, ఆగదు: కోదండరాం
న్యూఢిల్లీ/వరంగల్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని, రాయల తెలంగాణకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. ఈ భేటీలో సుమారు 30 నిముషాలపాటు రాష్ట్ర విభజనపై చర్చించారు.
దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణను ఒప్పుకునేది లేదని, ఆ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించినట్లు ఆయన చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని చెప్పినట్లు దామోదర రాజనర్సింహ తెలిపారు. అయితే రాయల తెలంగాణపై కూడా చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు తదితర అంశాలపై చర్చ జరగనుంది.

అదే సమయంలో న్యాయనిపుణులతో కూడా కేంద్రం విభజన చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి అంగీకరించడం లేదని సమాచారం. కాగా డిసెంబర్ 3వ తేదీన జరిగే పూర్తిస్థాయి సమావేశంలో జిఓఎం నివేదికపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 4వ తేదీన మరోసారి భేటీ అయిన తర్వాత తుది నివేదికను ఖరారు చేయనున్నారు.
తెలంగాణ ప్రక్రియ ఆగదు: కోదండరాం
వరంగల్: తెలంగాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఈ పరిస్థితుల్లో ఆగబోదని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌కు వచ్చిన ఆయన ఎంజిఎం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతల దీక్షా దివస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రక్రియ ఆగబోదని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టకుండా కేంద్రం వెనకడుగు వేస్తే తీవ్ర ప్రతిఘన ఎదుర్కొవాల్సి వస్తుందని కోదండరాం హెచ్చరించారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణనే తామూ కోరుకుంటున్నామని, డిసెంబర్ 4వ తేదీ వరకు కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తుందని నమ్మకం తమకు ఉందని ఆయన తెలిపారు. సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు అప్రమత్తంగా ఉండాలని కోదండరాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications