ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపాల్సిందే: టీ ఉద్యోగ నేతలు, కమిటీలపై ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజన కోసం కేంద్రం నియమించిన కమలనాథన్, షీలాభిడే కమిటీలపై తెలంగాణ ఉద్యోగ నేతలు బుధవారం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. త్వరితగతిన ఉద్యోగుల విభజన, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కు రప్పించడం, అలాగే తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా ఉద్యోగులను వెనక్కు పంపించడమనే ప్రధాన డిమాండ్లను కేంద్రానికి నివేదించారు.
వి. శ్రీనివాస్ గౌడ్, గుండవరపు దేవీప్రసాదరావు, కారం రవీందర్ రెడ్డి, మామిడి నారాయణ, ఏ. సత్యనారాయణ, ఎంబీ కృష్ణయాదవ్, మామిడి చంద్రశేఖర్ గౌడ్ తదితరుల నేతృత్వంలో టీఎన్జీవో నేతల బృందం ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో బుధవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసిన ఉద్యోగ నేతల బృందం కమిటీల పనితీరుపై ఫిర్యాదు చేసింది.
ప్రత్యేకించి ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియలో కమలనాథన్ కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం వద్ద టీఎన్జీవోలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కమలనాథన్ కమిటీకి ప్రస్తుతం అక్టోబర్ 30 వరకూ ఉన్న గడువును ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల విభజనను అక్టోబర్ 15కల్లా పూర్తి చేయాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన కోసం వేసిన కమల్‌నాథన్ కమిటీ ఇప్పటిదాకా విభజనను పూర్తిచేయలేదని, కమిటీ చేస్తున్న జాప్యాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని అన్నారు.
ఆ కమిటీ విధానాల వల్ల తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఆంధ్ర ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. షీలాభిడే కమిటీ పని తీరు కూడా నత్తనడకన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకుని ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తిచేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications