ఏపీలో భారీ వర్షాలు..! మూడు జిల్లాల్లో అలర్ట్..! మంత్రుల హెచ్చరికలు..!
ఏపీలో భారీ వర్షాల ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో నదుల్లో భారీగా నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఉన్న రెండు నదీ పరివాహక ప్రాంతాల్లోనూ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు అనిత, సత్యప్రసాద్ అధికారులతో నిత్యం సమీక్షిస్తున్నారు.
కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరికలు చేసింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3.06, ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.69, ఔట్ ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3.13, ఔట్ ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4 లక్షలు దాటిపోయింది. దీంతో వినాయక నిమజ్జనాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అటు గోదావరిలోనూ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో రెండూ 5.31 లక్షల క్యూసెక్కులుగా ఉంది రేపటికి దాదాపు మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు.

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు.
ఉపరితల అవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలెర్జ్ జారీ చేయడంతో ఎక్కడిక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి 3 లక్షల క్యూసెక్యులకు పైగా నీరు వస్తుండడంతో కృష్ణా నది పరిహార ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. కోస్తాంధ్ర తీరంలో అల్పపీడనం నేపథ్యంలో మత్య్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అటు భారీ వర్షాలపై హోంమంత్రి అనిత కూడా సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి అనిత.. వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications