త్వరలో అమరావతి ఐపీఎల్ టీమ్ -స్టేడియాలపై ఫోకస్-క్రీడా మంత్రి వెల్లడి..
ఏపీని వచ్చే ఐదేళ్లలో స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామని క్రీడామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఇవాళ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ శాప్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివర్లో ఆడుదాం ఆంధ్రా అంటూ అబాసుపాలు కార్యక్రమం నిర్వహించి, అందులోనూ రూ.120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు
అమరావతి పేరుతో వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గల్లీ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సహకానికి కృషి చేస్తామన్నారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాసక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ స్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామన్నారు.

రాష్ట్రంలో క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ చేసి అసలైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. క్రీడలకు ప్రధాన్యత ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా విద్యార్థులు ఆడుకోవడానికి గంట సమయం కేటాయించేలా టైం టేబుల్ ఏర్పాటు చేయిస్తామన్నారు. అలాగే క్రీడామైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇస్తామని, అవసరమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమరావతి, వైజాగ్ లలో అకాడమీల ఏర్పాటుకు చంద్రబాబు భూమి కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానిని తుంగలో తొక్కి క్రీడలకు అన్యాయం చేసిందన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసిపై సీఎం చంద్రబాబుతో చర్చించి త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో అనుమతి లేని క్రీడా అకాడమీల అనుమతులు రద్దు చేస్తామని అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహణ కార్పొరేషన్ పరిధిలో ఉందని, దీంతో గత ప్రభుత్వం కేవలం రాజకీయ కార్యక్రమాలకు ఎక్కువగా ఉపయోగించిందని, శాప్ పరిధిలోకి వచ్చే విధంగా కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తామన్నారు. అలాగే పే అండ్ ప్లే జీవో వల్ల ఇబ్బందులుంటే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications