గేరు మార్చిన జగన్: త్వరలో ఏపీ అసెంబ్లీ అత్యవసర భేటీ?: మంత్రివర్గ సమావేశం ఫిక్స్
అమరావతి: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై రాష్ట్రంలో రోజురోజుకూ రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. పోటాపోటీ దీక్షలు, ఉద్యమాలతో రాష్ట్రం వేడెక్కింది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలన్నీ విశాఖపట్నం చుట్టే తిరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. త్వరలోనే అసెంబ్లీని సమావేశపర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నేడు చంద్రబాబు..రేపు వైఎస్ జగన్: విశాఖ పాలిటిక్స్ గరంగరం: జేఏసీ నేతలతో భేటీ: హామీ?

23న కేబినెట్
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. వైఎస్ జగన్ దీనికి నేతృత్వం వహిస్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తారు. త్వరలో నిర్వహించబోయే మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపైనా సమీక్ష ఉంటుంది. కొత్త ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న వాటి తీరుతెన్నులను పర్యవేక్షిస్తారు.

ఎంత చేయాలో.. అంత
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రులు ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయం. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లిస్ట్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ పేరును తొలగించేలా చేయడానికి తీవ్రంగా శ్రమించక తప్పదనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది. ప్రైవేటీెకరణ ప్రతిపాదనలనను కేంద్రం ఉపసంహరించుకునేలా గరిష్ఠ స్థాయిలో ప్రయత్నాలు చేయక తప్పకపోవచ్చు. రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందులను కల్పించే అవకాశం ఉన్నందు వల్ల దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అత్యవసర అసెంబ్లీ భేటీ
ఇందులో భాగంగా- అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పర్చాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామంటూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించి.. కేంద్రానికి పంపించడానికి అసెంబ్లీ అత్యవసర భేటీ నిర్వహించాలని, దీనిపై మంత్రివర్గంలో తీర్మానం చేస్తారని అంటున్నారు. ఈ నెలాఖరులోనే అసెంబ్లీ అత్యవసర భేటీని నిర్వహించవచ్చనీ తెలుస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంత్రివర్గంలో సైతం ఓ తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు లేకపోలేదు.

సొంతంగా కొనుగోలుకూ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితే ఎదురైతే.. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా దాన్ని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలనే అంశం కూడా మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అవసరమైన చర్యలను ముందుగానే చేపట్టాల్సి ఉంటుందని, దీనికి అనుసరించాల్సిన విధి విధానాల గురించి మంత్రివర్గ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైేవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్లకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని జగన్ సర్కార్ కృతనిశ్చయంతో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

ఉగాది నుంచి రచ్చబండ
వచ్చే ఉగాది పండుగ నుంచి వైఎస్ జగన్.. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించదలిచిన విషయం తెలిసిందే. దీనిపైనా మంత్రివర్గం చర్చిచనుంది. ప్రభుత్వ పథకాల అమలు తీరు, డెలివరీ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు, వాటిని తొలగించడానికి రచ్చబండలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సమీక్షించే అవకాశం లేకపోలేదు. రచ్చబండ రూట్ మ్యాప్‌పైనా ప్రాథమికంగా కొన్ని నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. వలంటీర్ల గౌరవ వేతనం పెంపుదల సాధ్యసాధ్యాలు, వారికి ప్రకటించదలిచిన అవార్డులపై మంత్రులు సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు.