కొత్త రేషన్‌కార్డులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఏపీలో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చినవాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని, వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కొత్తగా వివాహమైనవారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కిలో రూ.150కే కందిపప్పు
గత ప్రభుత్వం రైతులకు రూ.1674 కోట్లను పెండింగ్ లో పెట్టిందని, వాటిని చెల్లిస్తున్నామని మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కిలో రూ.150కే అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య బాగా తగ్గాయని, అలాగే 60 లక్షల దీపం కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిందకు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. వాస్తవానికి ఈ పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు ఆరుశాతంగా ఉన్నాయని, అదనపు నిధులను కేటాయించి గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను కూడా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీఇచ్చినట్లు మనోహర్ పేర్కొన్నారు.

ఎందుకో జగనే చెప్పాలి
గత ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అక్రమంగా తరలించారని మంత్రి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగిందని, రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ అంటూ అడ్డగోలుగా వ్యవహరించిన గత ప్రభుత్వం రూ.1800 కోట్లు వృథా చేసిందని ధ్వజమెత్తారు. పింఛన్లు పెంచినందుకు లేదంటే పోలవరం పనులు ప్రారంభించబోతున్నందుకా? బడ్జెట్ లో ఏపీకి కేంద్రం సహకారం అందించినందుకా.. ఎందుకు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలో వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని మంత్రి మనోహర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications