ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్- కరోనా కేసులు తగ్గబోతున్నట్లు అంచనా...
ఏపీలో కరోనా కేసుల సంఖ్య మూడు వందలకు పైగా చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ తీపి కబురు చెప్పింది. సీఎం జగన్ ఇవాళ నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ మేరకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్ధితిపై స్పష్టత వచ్చిందని, దీంతో కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టనుందనే అంచనాలను సీఎం జగన్ కు అందించారు. దీంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంటోంది.

తుది దశకు కరోనా పరీక్షలు..
ఏపీలో మూడు వారాలుగా నిర్వహిస్తున్న కరోనా వైరస్ పరీక్షలు చివరి దశకు చేరుకుంటున్నాయి. నేరుగా కరోనా సోకిన వారితో పాటు వారితో ప్రాధమికంగా కాంటాక్ట్ అయినట్లు గుర్తించిన కరోనా బాధితులకు దాదాపుగా పరీక్షలు పూర్తయినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో ఇప్పుడు వారి నుంచి ఇతరులకు సోకిన వారికి పరీక్షలు నిర్వహించి కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కేసులు తగ్గుముఖం పట్టొచ్చన్న ప్రభుత్వం..
ఇవాళ ఉదయం సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో అధికారులు.. రాష్ట్రంలో తాజా పరిస్దితిపై వివరాలు అందజేశారు.. సోమవారం సాయంత్రం 6 గంటనుంచి ఇవాళ ఉదయం వరకూ 150 కోవిడ్ నిర్దారణా పరీక్షలు నిర్వహించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో ఒకే పాజిటివ్ కేసు వచ్చిందన్న అంశాన్ని వారు సీఎంకు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారితో పాటు వారి ప్రాధమిక కాంటాక్టులకు కూడా దాదాపు పరీక్షలు పూర్తయినట్లు చెప్పారు. కాబట్టి కేసుల సంఖ్య ఇక నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు విశ్లేషించారు

తాజా పరిస్దితి ఇదీ..
ఏపీలో ఇవాళ ఉదయం 9 గంటలవరకూ మొత్తం 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. వీరితో కాంటాక్ట్ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3-4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో కోవిడ్ -19 పాజిటివ్‌గా వచ్చిన వారు 84 మందిగా తేలింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టుల్లో 280 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విదేశాలనుంచి వచ్చిన వారికి 205 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. విదేశాలనుంచి వచ్చిన వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 6 గురికి పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలుగా భావించిన వారిలో 134 మందికి పరీక్షలు చేస్తే ఏడుగురికి నెగెటివ్ గా తేలింది.

ఇంకా క్లారిటీ కోసం ర్యాండమ్ పరీక్షలు..
ఇప్పటివరకూ నేరుగా విదేశాల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారితో కాంటాక్ట్ అయిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం దాదాపుగా ఓ క్లారిటీకి వచ్చింది. అయితే పూర్తిగా కరోనాను నియంత్రించేందుకు వీలుగా మరికొందరికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన ర్యాండమ్ పరీక్షల్లో అన్నీ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. కాబట్టి మరిన్ని ర్యాండమ్ పరీక్షల ద్వారా పరిస్ధితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రధాని ప్రకటించిన ఏప్రిల్ 14 లాక్ డౌన్ ముగిసే నాటికి ఏపీలో ఇక కరోనా కేసులు లేవనే ప్రకటన కూడా రావొచ్చని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications