Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Andhra Pradesh: నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే శుభవార్త

రోజు మొత్తం మగ్గం ముందు కూర్చుని చేతులతో బతుకును నేసే నేతన్నకు విద్యుత్ బిల్లు కూడా ఒక పెద్ద భారం. పెరిగిన ఖర్చులు, తగ్గిన ఆదాయాలతో ఎన్నో కుటుంబాలు చేనేత వృత్తిని వదిలేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అలాంటి నేతన్నల కష్టాలను తేలిక చేయడానికి కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఏప్రిల్‌ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలు ఉపయోగించే చేనేత కార్మికులకు నెలకు 500 యూనిట్లు ఉచితంగా అందించనున్నారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా నేతన్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక ఊరట లభించనుంది.

ఈ పథకం అమలుతో మగ్గం వాడే నేతన్నకు నెలకు సగటున రూ.720 వరకు, ఏడాదికి రూ.8,640 వరకు ఆదా కానుంది. మర మగ్గాలు ఉపయోగించే చేనేత కార్మికులకు నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 వరకు ఆర్థిక లబ్ధి కలుగుతుంది. మొత్తం మీద 93 వేల మగ్గాల కుటుంబాలు, 10,534 మర మగ్గాల కుటుంబాలు కలిపి 1,03,534 కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.85 కోట్లకు పైగా ఖర్చు చేయనుందని మంత్రి సవిత వెల్లడించారు.

Andhra Pradesh Govt Announces Free Power for Weavers From April 1 Providing Major Relief to Handloom Families

చేనేత రంగానికి సంపూర్ణ భరోసా

చేనేత రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సవిత తెలిపారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తుండగా, రాష్ట్రంలో ఇప్పటికే 87,280 మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచడంతో ఒక్కో నేతన్నకు ఏడాదికి రూ.12,000 అదనపు ఆదాయం లభిస్తోంది. అలాగే, ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు గడిచిన రెండు నెలల్లో రూ.7 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. త్రిఫ్ట్ ఫండ్ తొలి విడతగా రూ.1.67 కోట్లను మంజూరు చేయగా, ఎన్‌హెచ్‌డీసీ ద్వారా నూలుపై 15 శాతం రాయితీ అందిస్తున్నారు. నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా పెంచినట్లు మంత్రి వెల్లడించారు.

ఉపాధి పెంపుపై ప్రత్యేక దృష్టి

నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కో ఆప్టెక్స్, టాటా తనేరియా, బిర్లా ఆద్యం సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆప్కో ద్వారా రెడీమేడ్ దుస్తుల విక్రయాలు పెరగడంతో నేతన్నలకు ఉపాధి అవకాశాలు విస్తరించాయని చెప్పారు. ఈ-కామర్స్ వేదికల ద్వారా చేనేత వస్త్రాలను విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేనేత పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. మంగళగిరిలో మెగా టెక్స్‌టైల్ పార్కు, ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్, పిఠాపురం, ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలలో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10.44 కోట్లతో 10 మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ చర్యల ఫలితంగా జాతీయ స్థాయిలో ప్రకటించిన ఓడీ ఓపీ అవార్డుల్లో రాష్ట్రానికి వచ్చిన 9 అవార్డుల్లో 4 అవార్డులు చేనేత ఉత్పత్తులకే దక్కాయని, చేనేత అభివృద్ధికి గాను రాష్ట్రానికి జాతీయ స్థాయిలో బంగారు పతకం కూడా లభించిందని మంత్రి సవిత తెలిపారు.

గౌరవప్రదమైన జీవనమే లక్ష్యం

నేతన్నలకు కేవలం సబ్సిడీలు కాదు... గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత స్పష్టం చేశారు. అన్న ఎన్టీఆర్ కాలంలో మొదలైన చేనేతలకు అండగా నిలిచే పరంపరను నేడు సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకం నేతన్నల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+